మోదీకి ఇజ్రాయెల్‌ ప్రధాని కృతజ్ఞతలు

ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక మండలి(ఈఎస్‌వోఎస్‌వోసీ)లో ఇజ్రాయెల్‌కు భారత్‌ మద్దతుగా నిలిచినందుకు ఆ దేశ ప్రధాని నెతన్యాహు కృతజ్ఞతలు తెలిపారు. పాలస్తీనాకు సంప్రదింపుల హోదా కల్పించరాదన్న తమ వాదనకు మద్దతుగా నిలిచినందుకు ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు.

‘‘ఐరాసలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచినందుకు నరేంద్ర మోదీ, భారత్‌కు ధన్యవాదాలు’’ అని ట్వీట్‌ చేశారు. ఈ నెల ఆరో తేదీన ఈఎస్‌వోఎస్‌వోసీలో పాలస్తీనా స్వచ్ఛంద సంస్థ షాహీద్‌కు పరిశీలక హోదా కల్పించరాదని ఇజ్రాయెల్ ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటేసింది. ఐరాసలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా భారత్ ఓటేయడం ఇదే తొలిసారి.

కాగా, ఓటింగ్‌లో రష్యా, చైనా మాత్రం భారత్‌ వైఖరికి భిన్నంగా పాలస్తీనాకు అండగా నిలవడం గమనార్హం. ఇజ్రాయెల్ రాజధానిగా జరూసలెంను గుర్తిస్తూ గతంలో అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు తెలుపుతూ భారత్ ఓటు వేసిన విషయం తెలిసిందే.

జెరూసలెం విషయంలో అమెరికాకు వ్యతిరేకంగా ఓటువేయడాన్ని భారత్ అప్పట్లో సమర్ధించుకుంది. తొలి నుంచి పాలస్తీనా విషయంలో అనుసరిస్తున్న విధానానికి భరత్ కట్టుబడి ఉందని స్పష్టం చేసింది.