ఉగ్రవాదులకు మద్దతిచ్చే దేశాలను బహిష్కరించాలి

ఉగ్రవాదులకు మద్దతిచ్చే దేశాలను బహిష్కరించాల్సిన అవసరం ఉందని అంటూ  తీవ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న దేశాలను నిలువరించాల్సిందేనని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్కేక్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సమ్మేళనంలో సభ్యదేశాలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఉగ్రవాదానికి మద్దతిస్తూ ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం అందించే దేశాలు జవాబుదారీగా ఉండాలని స్పష్టం చేశారు. 

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఎస్‌సీవో స్ఫూర్తి, ఆదర్శాలు మరింత బలాన్ని ఇస్తాయని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చూస్తుండగానే, ఆయన సమక్షంలోనే మోదీ ఈ మేరకు వ్యాఖ్యానించడం విశేషం. భారత్‌ను ఎదుర్కునేందుకు ఓ దేశం గత కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచిపోషించడమే తన విధానంగా చేసుకుందంటూ పాకిస్తాన్‌ను ఉద్దేశించి ఆయన పరోక్షంగా  ధ్వజమెత్తారు. ఉగ్రవాదం పీడ వదిలించేందుకు అన్ని దేశాలు కలిసికట్టుగా ముందుకొచ్చి పోరాడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.  

ఇటీవల తాను శ్రీలంక వెళ్లాననీ.. ఏప్రిల్ 21న కొలంబో చర్చిలో బాంబు దాడుల కారణంగా అనేకమంది ప్రాణాలు కోల్పోయిన ప్రాంతాన్ని చూసి వచ్చానని మోదీ తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి నెలకొనాలని మోదీ ఆకాంక్షించారు. గత నాలుగు దశాబ్దాలుగా ఉగ్రవాదం, తిరుగుబాటుతో ధ్వంసమైన ఆ దేశం అభివృద్ధి చెందడం చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.   

ఎస్‌సీవోలో భారత్‌ రెండేళ్లుగా శాశ్వత సభ్యదేశంగా ఉందని, ఈ రెండేళ్లలో ఎస్‌సీవో చేపట్టే అన్ని కార్యక్రమాలకు సానుకూల సహకారం అందించామని మోదీ గుర్తు చేశారు. అంతర్జాతీయ వేదికపై ఎస్‌సీవో విశ్వసనీయతను పెంచేందుకు మున్ముందు మరింత సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. 

ఈ సందర్భంగా ఎస్‌సీవో సభ్య దేశాలకు మోదీ ఆరోగ్య  మంత్రాన్ని చెప్పారు. HEALTHలో ఒక్కో అక్షరానికి ఒక్కో అర్థం ఉందని వివరించారు. ‘‘H అంటే హెల్త్‌ అండ్‌ మెడికేర్‌(ఆరోగ్య సహకారం), E అంటే ఎకో(పర్యావరణ సహకారం), A అంటే ఆల్టర్నేట్‌ కనెక్టివిటీ(సముద్రమార్గం ద్వారా ప్రత్నామ్నాయ అనుసంధానం), L అంటే లిటరేచర్‌(అక్షరాస్యతపై అవగాహన), T అంటే టెర్రరిజం ఫ్రీ సొసైటీ(ఉగ్రవాద రహిత సమాజం), H అంటే హ్యుమానిటీ(మానవత్వ సహకారం)’’ అని మోదీ చెప్పుకొచ్చారు. ఇలా ప్రపంచ దేశాలు పరస్పరం ఆరోగ్య  సహకారం అందించుకోవాలని మోదీ సూచించారు.