అత్యంత ఫలప్రదంగా జిన్‌పింగ్‌తో భేటీ

కిర్గిస్థాన్ రాజధాని బిష్‌కెక్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లతో ప్రధాని నరేంద్రమోదీ సమావేశమయ్యారు. జిన్‌పింగ్‌తో భేటీ అత్యంత ఫలప్రదంగా సాగిందని ప్రధాని వెల్లడించారు. ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు బలోపేతం చేసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. మోదీ రెండోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఇరువురు నేతలు భేటీ కావడం ఇదే మొదటిసారి. ఎన్నికల్లో ఘన విజయం సాధించడంపై మోదీకి ఈ సందర్భంగా జిన్‌పింగ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే ఈ నెల 15న 66వ పడిలోకి అడుగుపెడుతున్న జిన్‌పింగ్‌కు భారత ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.ఉహాన్‌లో మన సమావేశం తర్వాత, ఇరు దేశాల మధ్య సంబంధాల్లో వేగం, స్థిరత్వం పెరిగింది. వ్యూహాత్మక సంబంధాల్లో గణనీయ పురోగతి చోటుచేసుకుంది. పరస్పర ప్రయోజనాలు, ఆందోళనలపై సున్నితంగా వ్యవహరించడం జరుగుతున్నది అని ప్రధాని మోదీ జిన్‌పింగ్‌తో వ్యాఖ్యానించారు. 2017లో డోక్లాం వివాదం కారణంగా ఇరుదేశాల మధ్య క్షీణించిన సంబంధాలను ఉహాన్ సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు సమావేశమై తిరిగి వాటిని గాడినపెట్టారు. 

టారిఫ్‌ను ఆయుధంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ఏకపక్ష వాణిజ్య విధానాలకు వ్యతిరేకంగా ఐక్య కూటమి ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని జిన్‌పింగ్ లేవనెత్తే అవకాశం ఉందని భేటీకి ముందు చైనా సంకేతాలిచ్చింది. ఏడాదికాలంగా అమెరికా, చైనా మధ్య వాణిజ్యం విషయంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. భారత్‌కు కల్పిస్తున్న వాణిజ్య ప్రాధాన్య హోదాను (జీఎస్పీని) అమెరికా ఉపసంహరించుకున్న నేపథ్యంలో ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా భారత్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉందని చైనా భావిస్తున్నది .

కాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన భేటీ అద్భుతంగా సాగిందని, ఇరు దేశాల వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు అన్ని అంశాలపై సమీక్ష నిర్వహించినట్లు మోదీ తెలిపారు. రక్షణ, శక్తి (ఎనర్జీ) రంగాలపై ప్రధానంగా చర్చలు జరిగినట్లు విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీలో ఏకే-203 రైఫిళ్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు సహకరించినందుకు పుతిన్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. సెప్టెంబర్ మొదట్లో రష్యాలో జరిగే ఈస్ట్రన్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని పుతిన్ ఆహ్వానించగా, అందుకు ప్రధాని సమ్మతించారు.

ఇలా ఉండగా, ఉగ్రవాదంపై పాకిస్థాన్ నిర్దిష్ట చర్యలు చేపడితేనే శాంతి చర్చలకు ఆస్కారముంటుందని ప్రధాని మోదీ.. జిన్‌పింగ్‌కు స్పష్టం చేశారు. పాకిస్థాన్ కేంద్రంగా సాగుతున్న సీమాంతర ఉగ్రవాదంపై ఇరువురు నేతల భేటీలో స్వల్ప చర్చ జరిగినట్లు భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే తెలిపారు. పాక్‌తో శాంతిపూర్వక సంబంధాలను భారత్ కోరుకుంటున్నదని ఆయన చెప్పారు. పాకిస్థాన్‌తో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు తాను ప్రయత్నించినప్పటికీ, ఆ ప్రయత్నాలు అన్నీ పట్టాలు తప్పాయని జిన్‌పింగ్‌తో మోదీ చెప్పినట్లు గోఖలే తెలిపారు.

ఉగ్రవాద రహిత వాతావరణాన్ని పాకిస్థాన్ కల్పించాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. శాంతి చర్చలు కొనసాగించేందుకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాక్ నిర్దిష్ట చర్యలు చేపట్టాలి అని మోదీ జిన్‌పింగ్‌తో పేర్కొన్నారని గోఖలే చెప్పారు. ఎస్‌సీవో సదస్సు సందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తోనూ జిన్‌పింగ్ భేటీ కానున్నారు.