భారత్‌కు సొంతంగా అంతరిక్ష కేంద్రం

మనదేశానికి సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించ నున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సంచలన ప్రకటన చేసింది. గగన్‌యాన్ తర్వాత ఈ ప్రాజెక్టును చేపట్టనున్నది. ఇస్రో చైర్మన్ కే శివన్ మీడియాతో మాట్లాడుతూ సంస్థ ప్రణాళికలు వివరించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత్ చేరబోదని స్పష్టంచేశారు. వచ్చే నెల 15న జరుపనున్న చంద్రయాన్-2 ప్రయోగంపైనే ప్రస్తుతం తమ దృష్టి మొత్తం కేంద్రీకృతమై ఉన్నదని చెప్పారు. ఆ తర్వాత మొదటి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌పై దృష్టిపెడుతామని తెలిపారు.

భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తిచేసుకోబోతున్న సందర్భంగా 2022లో గగన్‌యాన్ మిషన్‌ను చేపట్టనున్నారు. దీనికి కొనసాగింపుగా భారత్‌కు సొంతగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించినట్టు శివన్ వెల్లడించారు. గగన్‌యాన్ అనంతరం 5-7 ఏండ్లలో ఇది సాకారం కావొచ్చన్నారు. స్పేస్ స్టేషన్ చిన్నగా ఓ మాడ్యూల్ రూపంలో ఉంటుందని, ఇందులో మైక్రోగ్రావిటీపై పరిశోధనలు జరుపుతామని పేర్కొన్నారు. ఎంత వ్యయం అవుతుందో ఇంకా అంచనా వేయలేదని చెప్పారు. వచ్చే 2-3 ఏండ్లలో శుక్రుడిపైకి ఉపగ్రహాన్ని పంపనున్నట్లు తెలిపారు.

విశ్వంపై పరిశోధనలకు అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ల నిర్మాణం ఏండ్ల తరబడి సాగుతున్నది. ఇప్పటివరకు 9 స్పేస్‌స్టేషన్లు నిర్మించారు. వాటిలో 8 విఫలం కాగా 9వదైన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) విజయవంతంగా కొనసాగుతున్నది. దీనిని అమెరికా, రష్యా సంయుక్తంగా నిర్మించాయి. ఐఎన్‌ఎస్ ఇటీవలే 20 ఏండ్లు పూర్తిచేసుకున్నది. ఇది అంతరిక్షంలోని ప్రయోగశాల. విశ్వంలో ప్రయోగాలకు వేదిక. రోదసిని గమనించే ఒక అబ్జర్వేటరీ.

భవిష్యత్‌లో చంద్రుడితోపాటు అంగారకుడిపైకి చేపట్టే మానవ సహిత అంతరిక్ష యాత్రలకు స్పేస్ స్టేషన్ తొలి మజిలీగా, తాత్కాలిక విశ్రాంతి స్థలమవుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 1998 నవంబర్ 20న రష్యాలోని బైకనూర్ అంతరిక్ష ప్రయోగ కేం ద్రం నుంచి దీన్ని విశ్వంలోకి పంపారు. మొద ట్లో 41 అడుగుల పొడవైన మాడ్యూల్(చిన్న గది) రూపంలో ఉన్న దీన్ని ఇప్పటి రూపం లోకి తేవడానికి పదేండ్లలో 30 అంతరిక్ష యాత్రలు జరిపారు. ప్రసుతం దీని పొడవు 72.8 మీటర్లు. వెడల్పు 108.5 మీటర్లు. ఎత్తు 20 మీటర్లు. బరువు దాదాపు 454 టన్నులు.

భూమికి 278 నుండి 460 కి.మీ.ల ఎత్తులోని కక్ష్యలో ఐఎస్‌ఎస్ తిరుగుతున్నది. సగటున గంటకు 27,743 కి.మీ.ల వేగంతో భూమి చుట్టూ పరిభ్రమిస్తున్నది. 90 నిమిషాలకు ఒక పరిభ్రమణం చొప్పున రోజుకు దాదాపు 16 సార్లు భూమిని చుట్టివస్తున్నది. ఈ ఏడాది మే చివరి నాటికి ఇప్పటివరకు మొత్తం 116,178 ప్రదక్షిణలు పూర్తిచేసింది.

ఐఎస్‌ఎస్‌లో వ్యోమగాములు నివసించడం 2000 నవంబర్‌లో ప్రారంభమైంది. ఇందులో అయిదు పడకగదులు ఉన్నాయి. ఆరుగురు వ్యోమగాములు నివసించేలా సదుపాయాలను కల్పించారు. ప్రస్తుతం ఆరుగురు వ్యోమగాములు నివసిస్తున్నారు. ఐఎస్‌ఎస్ ఒక అంతరిక్ష ప్రయోగశాల వంటిది. ఇక్కడ విశ్వంపై పరిశోధనలతోపాటు జీవశాస్త్రం, శరీరధర్మశాస్త్రం, భౌతికశాస్త్రం వంటి అనేక విభాగాలు, వాతావరణానికి సంబంధించిన అనేక అంశాలపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. భూవాతావరణంతోపాటు విశ్వాన్ని నిరంతరం గమనిస్తూ ఉండవచ్చు.

ఐఎస్‌ఎస్‌లో మొత్తం 15 దేశాలకు భాగస్వామ్యం ఉన్నది. ఐదు అంతరిక్ష పరిశోధన సంస్థలు దీనిని నిర్వహిస్తున్నాయి. అమెరికా నాసాతోపాటు రష్యా రొస్కొస్మోస్, జపాన్‌కు చెందిన జాక్సా, యూరప్‌కు చెందిన ఈఎస్‌ఏ, కెనడాకు చెందిన సీఎస్‌ఏ దీనిని నిర్వహిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఐఎస్‌ఎస్ జీవితకాలం 2030తో ముగియనున్నది. భూమి నుంచి వస్తువులు, పరికరాల సరఫరాను 2025తో నిలిపివేయనున్నారు. ఐఎస్‌ఎస్‌పై పెట్టుబడి పెట్టడాన్ని 2024లో నిలిపివేస్తామని రష్యా, 2025లో నిలిపివేస్తామని అమెరికా ప్రకటించాయి.