కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో ప్రభుత్వాల ఏర్పాటే లక్ష్యం

కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసినప్పుడే పార్టీ అత్యున్నత శిఖరాలకు చేరినట్లవుతుందని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా తెలిపారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించినా పార్టీ ఇంకా శిఖరాగ్రానికి చేరుకోలేదని చెప్పారు. నూతన ప్రాంతాలకు విస్తరించడంతోపాటు మరిన్ని వర్గాల ప్రజల మనస్సుల్లో చోటు సంపాదించుకునేందుకు పార్టీ కృషి చేయాలని పిలుపిచ్చారు.

అమిత్ షా పార్టీ జాతీయ ఆఫీస్ బేరర్లు, వివిధ రాష్ర్టాల ప్రతినిధులతో గురువారం ఆయన సమావేశమయ్యారు. తెలంగాణలో, పశ్చిమబెంగాల్‌లో పార్టీ గెలుపొందిన ఎంపీ సీట్లను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిరాశాజనక ఫలితాలు వచ్చినప్పటికీ.. లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు చోట్ల విజయం సాధించడం మంచి పరిణామమని, ఇదే ఉత్సాహంతో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.

తెలంగాణలో బీజేపీ 4 ఎంపీ సీట్లను గెలుచుకోవడంపై అమిత్‌షా సంతోషం వ్యక్తంచేశారు. ప్రధాని నరేంద్రమోదీ హవాతోపాటు తెరాస ప్రభుత్వ వైఫల్యాలు పార్టీకి కలిసి వచ్చాయని విశ్లేషించారు. తెలంగాణలో బిజెపి మంచి భవిష్యత్తు ఉందని చెబుతూ  రాష్ట్రంలో యువ ఓటర్లపై ప్రత్యేకదృష్టి పెట్టాలని.. పార్టీ సభ్యత్వ నమోదులో అన్ని సామాజిక వర్గాల సమతుల్యత ఉండేలా చూడాలని సూచించారు.

పార్టీ సభ్యత్వాన్ని మరో 20 శాతం పెంపొందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. బీజేపీ వ్యవస్థాపకుడు శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భం గా వచ్చేనెల ఆరో తేదీ నుంచి సభ్యత్వ డ్రైవ్ చేపట్టనున్నట్లు బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ తెలిపారు. పార్టీ ఉపాధ్యక్షుడు, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం 11 కోట్ల మంది సభ్యులు ఉండగా, ఈ ఏడాది మరో 20 శాతం మందిని అదనంగా చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు.