కొత్త అధ్యక్ష ఎన్నిక వరకు బిజెపి అధ్యక్షుడిగా అమిత్ షానే

కేంద్ర మంత్రి పదవి చేపట్టడంతో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా స్థానంలో మరొకరిని పార్టీ అధ్యక్షుడిగా నియమించే ప్రక్రియకు పార్టీ నాయకత్వం పక్కన పెట్టింది. పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా, ఈ సంవత్సరం చివరికి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొనే వరకు ఆయనను అధ్యక్షుడిగా కొనసాగమని కోరిన్నట్లు తెలుస్తున్నది. 

అమిత్‌ షా స్ధానంలో పలువురి పేర్లు వినిపించినా ప్రస్తుతం కొత్త అధ్యక్షుడి ఊసు లేదని పార్టీ అగ్రనాయత్వం స్పష్టం చేసిందని చెబుతున్నారు. రానున్న కొద్దినెలల్లో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత వచ్చే ఏడాది ఆరంభం వరకూ అమిత్‌ షానే అధ్యక్ష హోదాలో కొనసాగుతారని బీజేపీ నాయకత్వం పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపింది.  

ఈ ఏడాది ద్వితీయార్ధంలో జరిగే హర్యానా, జమ్ము కశ్మీర్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చిన తర్వాతే సారథ్య బాధ్యతలను వేరొకరికి అప్పగిస్తారని చెబుతున్నారు.  పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఈ సంవత్సరం డిసెంబర్ లో గాని, వచ్చే ఏడాది జనవరి లో గాని జరుగుతుంది. అప్పటికి అమిత్ షా వరుసగా రెండు పర్యాయాలు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన్నట్లు అవుతుంది. పార్టీ నిబంధనావళి ప్రకారం వరుసగా రెండు పర్యాయాలు ఎవరికైనా అధ్యక్ష పదవి చేపట్టే అవకాశము ఉంటుంది. 

ఢిల్లీలో గురువారం జరిగిన పార్టీ భేటీకి పార్టీ ప్రధాన కార్యదర్శులు, బీజేపీ రాష్ట్ర శాఖల అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు  హాజరయాయరు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీలో సంస్ధాగత ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టడం ద్వారా పార్టీ నాయకత్వ మార్పు దిశగా కసరత్తును చేపడతారు.

సభ్యత్వ నమోదు కార్యక్రమం  పూర్తయిన తర్వాత సంస్థాగత ఎన్నికల ప్రణాళిక ఖరారు చేస్తామని పార్టీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ తెలిపారు.  సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జూలై నుంచి చేపట్టాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది.