రెండో రోజే జగన్‌, చంద్రబాబుల మాటల యుద్ధం

ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభమైన రెండో రోజే అధికార, ప్రతిపక్ష సభ్యలు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. నూతన సభాపతికి ధన్యవాదాలు తెలిపే అంశంపై చర్చ సందర్భంగా ఇరుపక్షాలు వ్యక్తిగత దూషణలకు దిగాయి. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సీఎం జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబు పరస్పరం విమర్శలు చేసుకోవడంతో సభలో వేడి పెరిగింది. 

23 మంది వైసిపి  ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసి వారిలో నలుగురిని మంత్రులను చేశారని  సీఎం జగన్‌ ఘాటుగా విమర్శించారు. ‘‘ముగ్గురు ఎంపీలను ప్రలోభాలు పెట్టి తీసుకున్నారు. చివరికి ఏం జరిగింది. ప్రజలు గూబ గుయ్యి.. అనేట్టు కొట్టారు. అన్యాయం చేసిన వాళ్లకు.. అదే 23 మంది ఎమ్మెల్యేలు, అదే ముగ్గురు ఎంపీలు గెలిచారు. అది కూడా 23వ తేదీనే తీర్పు ఇచ్చారు" అంటూ గుర్తు చేశారు. 

తాను కూడా చంద్రబాబు మాదిరిగా ఆలోచించి ఉంటే ఆయనకు (చంద్రబాబుకు) ప్రతిపక్ష హోదా కూడా దక్కేది కాదని అంటూ తనతో ఎంతమంది టచ్‌లో ఉన్నారో చెప్పాలా..?  అంటూ జగన్ నిలదీశారు.  "నేను కూడా ప్రలోభ పెడితే ఎంతమంది మిగులుతారో చూస్తాను. ఈ అన్యాయమైన సంప్రదాయానికి స్వస్తి పలకాలి, అసెంబ్లీలో మంచి సంప్రదాయం రావాలి’’ అని జగన్‌ స్పష్టం చేశారు. 

అంతకు ముందు అంబటి రాంబాబు, శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు సభా సంప్రదాయాలను గౌరవించడం లేదని విమర్శించారు. కొత్తగా ఎన్నికైన సభాపతిని ఆ స్థానంలో కూర్చోబెట్టేందుకు కూడా చంద్రబాబు రాలేదని, ఇదెక్కడి సంప్రదాయమని వ్యాఖ్యానించారు.

జగన్‌ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందిస్తూ  తొలి ప్రసంగంలోనే జగన్‌ ఇలా మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు. ‘‘సీఎం ప్రసంగం ప్రతిపక్షాన్ని కించపరిచేలా ఉంది. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. 1978లో రెడ్డి కాంగ్రెస్‌ నుంచి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఎమ్మెల్యే అయినప్పుడు పార్టీ మారలేదా? గెలిచిన నాలుగురోజుల్లోనే పార్టీ మారారు. అప్పట్లో బాట్టం శ్రీరామ్మూర్తిగారు మీకంటే ఎక్కువ ఘాటుగా విమర్శించారు. ఆ చరిత్రను ఒకసారి చూసుకోండి" అంటూ హితవు చెప్పారు. 

"తండ్రికి వారసులుగా చెప్పుకుంటున్నవారు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి. మీ తండ్రి చేసింది తప్పని ఒప్పుకోవాలి. అధికార పక్షం సంప్రదాయాలు పాటించకపోయినా మేము పాటిస్తాం. సభాపతిగా తమ్మినేని పేరు ప్రకటించగానే ప్రొటెం స్పీకర్‌ మమ్మల్ని కూడా అడుగుతారని భావించా. ప్రతిపక్ష నేతను ఆహ్వానిస్తే బాగుండేది. గతంలో స్పీకర్‌ను ఎంపిక చేశాక మంత్రులను జగన్‌ వద్దకు పంపించి నామినేషన్లు వేయించా. కోడెల అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వాళ్లు కూడా సంతకాలు చేశారు" అని గుర్తు చేశారు.