ఏపీ సభాపతిగా తమ్మినేని

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభాపతిగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్‌ ఎన్నికకు సంబంధించి బుధవారం ఆయన ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. 

గురువారం ఉదయం సభ ప్రారంభమైన తర్వాత ప్రొటెం స్పీకర్‌ శంబంగి వెంకట చిన అప్పలనాయుడు సభాపతి ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. సభాపతి పదవికి తమ్మినేని ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేసినందున ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్‌ ప్రకటించారు. 

అనంతరం ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి, టిడిపి  ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తదితరులు తమ్మినేనిని సభాపతి స్థానం వరకూ తోడ్కొని వెళ్లగా.. ఆయన సభాపతి స్థానంలో ఆసీనులయ్యారు.

కొత్త స్పీకర్‌గా ఎన్నికైన తమ్మినేని సీతారాంకు సీఎం జగన్ అభినందనలు తెలుపుతూ . ఇదే శాసన సభలో విలువల్లేని రాజకీయాలు చూశామని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేతను మాట్లాడనివ్వని రాజకీయాలు చేశామని అంటూ తాను కూడా అలాగే చేస్తే మంచి అనేది ఎక్కడా కనిపించదని చెప్పారు. చట్టసభలపై అవగాహన ఉన్న వ్యక్తిని స్పీకర్‌గా ఎంపిక చేశామని జగన్‌ స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో పార్టీ మారినవారిపై చర్యలు తీసుకోవాలని కోరినా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. స్పీకర్‌ ఎలా ఉండకూడదో గత సభలో చూశామని చెబుతూ స్పీకర్‌ అంటే ఎలా ఉండాలో ఇప్పుడు చూపిస్తామని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేలను లాగేసుకుంటే ప్రతిపక్ష హోదా ఉండదని కొందరు చెప్పారని పేర్కొంటూ అలా చేస్తే చంద్రబాబుకు తనకు తేడా ఏముంటుందని చెప్పానని తెలిపారు. పార్టీ ఫిరాయిస్తే వెంటనే అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ చర్యలు తీసుకోవాలని జగన్ స్పష్టం చేశారు.

బీసీ సామాజికవర్గానికి చెందిన సీతారాం  శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో మూడుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం తమ్మినేని సీతారాంకు ఉంది.