కిర్గిజ్‌స్తాన్ బయల్దేరిన ప్రధాని మోదీ

రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ కిర్గిజ్‌స్తాన్ బయల్దేరి వెళ్లారు. బిష్కెక్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సమ్మేళనంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశాల సందర్భంగా రష్యా, చైనా దేశాలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ నెల 13, 14 తేదీల్లో బిష్కేక్‌లో జరిగే ఎస్‌సీవో దేశాధినేతల మండలి (సీహెచ్ఎస్) సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్న సందర్భంగా ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి.

ఈ సమావేశానికి భారత్ విశేష ప్రాధాన్యత ఇస్తున్నట్లు బయలుదేరేముందు ఒక ప్రకటనలో ప్రధాని పేర్కొన్నారు. ఈ ప్రాంతపు ప్రజల మధ్య రాజకీయ, ఆర్ధిక, భద్రత పర అంశాలపై సహకారం పెంపొందుకు ఇది దోహదపడగలదని భావిస్తున్నట్లు చెప్పారు. రెండేళ్ల క్రితం పూర్తిస్థాయి సభ్యత్వం పొందినప్పటి నుండి ఈ మండలిలో జరుగుతున్న వివిధ సమాలోచనలలో భారత్ క్రియాశీలకంగా పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు.

అంతర్జాతీయంగా, ప్రాంతీయంగా ప్రాధాన్యత గల భద్రత పరిస్థితులు, బహుముఖ సహకారం, ప్రజల మధ్య సంబంధాలు వంటి అంశాలు ఈ సందర్భంగా చర్చకు రాగలవని ప్రధాని చెప్పారు.

ఆతిథ్య దేశం కిర్గిజ్‌స్తాన్‌‌తో రేపు భారత్ చర్చలు జరపనుంది. ఫిబ్రవరి నుంచి మూసివేసిన గగన తలాన్ని మోదీ కోసం మళ్లీ తెరుస్తున్నట్టు దాయాది దేశం ప్రకటించినప్పటికీ... మోదీ ఈ మార్గంలో వెళ్లేందుకు తిరస్కరించారు. ఇవాళ ఉదయాన్నే బయల్దేరిన ఆయన.. ఒమన్, ఇరాన్ మీదుగా బిష్కేక్ వెళ్లారు. 

 కాగా ఎస్‌సీవో సమావేశాలకు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా రానున్నారు. ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడి మొదలు.. ఇరుదేశాల మధ్య కొన్ని నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు దేశాల నాయకులు ఒకే వేదికపై కలుసుకోనుండడం ఇదే తొలిసారి. అయితే మోదీ, ఇమ్రాన్ మధ్య ఎలాంటి చర్చలు జరగడం లేదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది.

ఇరుదేశాల మధ్య సమస్యలను పరిష్కరించుకుని భారత్‌తో కలిసి నడిచేందుకు తాము సిద్ధమంటూ పాకిస్తాన్ ప్రధాని లేఖరాసినప్పటికీ.. భారత్ అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఉగ్రవాదం, చర్చలు ఒకే చోట ఇమడలేవని స్పష్టం చేస్తూ వస్తున్న భారత్ తాజాగా మళ్లీ అదే వైఖరి కొనసాగిస్తోంది.