రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు, ప్లాట్ల అప్పగింతపై ప్రతిష్టంభన!

రాజధాని ప్రాంతంలో చేపట్టిన నిర్మాణాలు, భూములిచ్చిన రైతులకు ప్లాట్ల అప్పగింతపై కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఉత్కంఠగా మారింది. 25 శాతం పనులు పూర్తి కాని నిర్మాణాలను నిలిపేయాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణహాయించడంతో రాజధానిలో చేపట్టిన ప్రభుత్వ పరిపాలన భవనాల కాంప్లెక్సు నిర్మాణం పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

ఐదు ఐకానిక్‌ టవర్ల నిర్మాణానికి జనవరిలో అప్పటి సిఎం చంద్రబాబు శంకుస్థాపన చేయగా, వీటి నిర్మాణం కొనసాగింపుపై ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ నిర్మాణాలు పునాదుల దశలో ఉన్నాయి.  రాజధానిలో పలు పనులను ఎన్నికలకు ముందు హడావుడిగా చేపట్టారు. ఈ పనులింకా ప్రారంభం కాలేదు. దీంతో, ఈ పనులను కొనసాగిస్తారా? నిలిపివేస్తారా? లేదా మళ్లీ సమీక్షించి టెండర్లు పిలుస్తారా? అని  తర్జనభర్జనలు జరుగుతున్నాయి. 

జగన్‌ ప్రతిపక్ష నాయకునిగా ఉన్న సమయంలో రాజధానికి 50 వేల ఎకరాలు అవసరం లేదని, తాము అధికారంలోకి వస్తే ఇష్టం లేకుండా భూములిచ్చిన వారికి తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాజధానిలో ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాల, టిడిపి ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనల అమలుపై జగన్‌ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందోనని రైతుల్లో ఆసక్తి నెలకొంది.

2015 జనవరి నుంచి ఫిబ్రవరి 28 వరకూ చేసిన భూ సమీకరణలో 22,726 మంది రైతులకు చెందిన 34,724 ఎకరాలను సిఆర్‌డిఎకు అప్పగించారు. రైతులిచ్చిన భూమికి ప్రతిగా జరీబు గ్రామాల్లో 1450 గజాలు, మెట్ట భూములకు 1250 గజాలు ఇచ్చేందుకు సిఆర్‌డిఎ అంగీకరించింది. ఈ మేరకు ప్లాట్లు కేటాయించారు.

వీటిని రోడ్లు, డ్రెయిన్లు, ఇతర మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసి అప్పగిస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకూ 29 గ్రామాల్లో రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించలేదు. రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్ల కేటాయింపుపై గత ప్రభుత్వం సాచివేత ధోరణి అవలంభించడం వల్ల ఇప్పుడు పరిస్థితి ఏమిటన్నదీ అంతుబట్టడం లేదు.

భూ సమీకరణలో తీసుకున్న భూములతో ప్రభుత్వం పరిధిలో ఉన్న మరో 17 వేల ఎకరాలను 29 గ్రామాల పరిధిలోని రాజధాని అవసరాలకు వినియోగించేందుకు సిఆర్‌డిఎకు అప్పగించారు. రైతుల నుంచి తీసుకున్న కొంత భూమిలో ఇప్పటికే ఐదు వేల ఎకరాల వరకూ ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలకు ప్రభుత్వం అప్పగించింది. ఇందులో ప్రయివేట్‌ సంస్థలకు ధారాదత్తం చేసిన భూములు 4,300 ఎకరాల వరకూ ఉన్నాయి. పొలాల్లోనే రహదారులను నిర్మించారు.

రూ.45 వేల కోట్లతో రహదారులు, శాశ్వత సచివాలయం (ప్రభుత్వ కాంప్లెక్స్‌), రాజ్‌భవన్‌, ఎమ్మెల్యేలు, ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారులకు క్వార్టర్లు, భవనాల నిర్మాణం, రహదారులు వివిధ దశల్లో ఉన్నాయి.  ఇప్పటికే సమీకరణలో భూమి ఇవ్వని రైతులను పూర్తిగా తప్పిస్తారా? వారిని తిరిగి ఒప్పించి అర్ధాంతరంగా నిలిచిన నిర్మాణాలను కొనసాగిస్తారా? ప్రభుత్వం ఇప్పుడు తేల్చవలసి ఉంది.