యడ్యూరప్ప రాకతో కుమారస్వామి కలవరం !

ఢిల్లీలో జరుగుతున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో పాల్గొనడానికి వెళ్ళిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర బిజెపి అద్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప హుటాహుటిన ఢిల్లీ నుంచి బెంగళూరుకు చేరుకావడంతో కర్ణాటకలో అధికారంలో ఉన్న కూటమిలో కలవరం కలిగిస్తున్నది. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు, తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకే ఆయన వచ్చారని అంటూ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి ఆందోళన వ్యక్తం చేయడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

 ప్రతిపక్షం ప్రయత్నిస్తోందంటూ ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలోనే ఆయన ఆగమేఘాల మీద ఢిల్లీ నుంచి రావడం చర్చనీయాంశమైంది. కాగా తాను అత్యవసరంగా జరుగుతున్న ఓ కుటుంబ కార్యక్రమం గురించి వచ్చాననీ, రాష్ట్ర రాజకీయాలతో దీనికి సంబంధం లేదని యడ్యూరప్ప స్పష్టం చేసినా అధికార కూటమి కుదుట పడటం లేదు. మంత్రి పదవులు దక్కని పలువురు కాంగ్రెస్ శాసన సభ్యులు అసంతృప్తితో ఉండటం, బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉండడంతో వారెక్కడ బిజెపితో చేతులు కలుపుతారో అని ముఖ్యమంత్రి ఖంగారు పడుతున్నారు.

మరో ఎనిమిది మంది శాసన సభ్యుల మద్దతు లభిస్తే ప్రభుత్వం ఏర్పాటుకు బిజెపికి వీలవుతుంది. అందుకనే కొందరు శాసనసభ్యుల నుండి ఏదో సంకేతం వస్తే తిరిగి వచ్చి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఎంపి డి సురేష్ కూడా ఇటువంటి అనుమానలనే వ్యక్తం చేసారు.  బెళగావిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మి హెబ్బాల్కర్, జార్ఖిహోళి సోదరుల మధ్య నెలకొన్న వైరం చిలికి చిలికి ఏకంగా రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వానికి ఎసరుపెట్టేదాకా వెడుతున్నదని అధికార కూటమి ఆందోళన చెందుతున్నది.

దీంతో ఎమ్మెల్యేలకు గాలం వేసి సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి ఇదో మంచి అవకాశమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. తమ ప్రభుత్వాన్ని అస్తిరపాలు చేయడానికి బిజెపి ప్రయత్నం చేస్తున్నదని అంటూ కుమారస్వామి మండిపడ్డారు.