15వ శాసనసభలో శాసన సభ్యుల ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్‌లో నూతన శకానికి తెరతీసిన 15వ శాసనసభ కొలువుదీరింది. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం బుధవారం ఉదయం 11.05 గంటలకు 15వ శాసనసభ తొలి సమావేశం ప్రారంభమైంది. ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన శంబంగి చిన వెంకట అప్పలనాయుడు సభాపతి స్థానంలో ఆసీనులయ్యారు. జాతీయ గీతంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 

అనంతరం ముఖ్యమంత్రి, సభానాయకుడైన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొదట శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రమాణం చేశారు. అనంతరం మంత్రులు ప్రమాణం చేశారు. అనంతరం అక్షర క్రమంలో సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. 

గోపీరెడ్డి శ్రీనివాసరెడ్డి మినహా మొత్తం 173మంది సభ్యులు ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకరించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తప్పుగా ప్రమాణం చేశారని ప్రొటెం స్పీకర్‌ చిన అప్పలనాయుడు తెలుపడంతో ఆయన మరోసారి శాసనసభ సభ్యుడిగా దైవసాక్షిగా ప్రమాణం చేశారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రమాణం అనంతరం అసెంబ్లీ గురువారం ఉదయం 9 గంటలకు వాయిదా పడింది.  

ఇలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ నూతన అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల కావడంతో,  స్పీకర్‌గా స్పీకర్‌ పదవికి తమ్మినేని సీతారాం నామినేష్‌ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 30 మంది సభ్యులు మద్దతు పలికారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఆయన శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 

ఆయన ఇప్పటి వరకు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. స్పీకర్‌గా తమ్మినేని గురువారం అధికారికంగా భాధ్యతలు చేపట్టనున్నారు.