బిజెపి ప్రదర్శకులపై బెంగాల్ పోలీసుల లాఠీచార్జి

పశ్చిమ బెంగాల్ లో తమ పార్టీ కార్యకర్తల హత్యలను నిరసిస్తూ బీజేపీ బుధవారం కోల్‌కతాలో భారీ నిరసన చేపట్టింది. నిరసనలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన బీజేపీ శ్రేణులను పోలీస్‌ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు అడ్డగించి ముందుకు కదలకుండా నిరోధించారు. బీజేపీ శ్రేణులు ముందుకు కదలకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు.

బారికేడ్లను దాటి లోనికి చొచ్చుకువచ్చేందుకు బీజేపీ కార్యకర్తలు చేసిన ప్రయత్నాలను అడ్డుకున్న పోలీసులు నిరసనకారులను చెదరగొట్టేందుకు భాష్పవాయుగోళాలను ప్రయోగించారు. తృణమూల్‌ ప్రభుతంపై నిరసనలకు దిగిన బీజేపీ కార్యకర్తలపై కోల్‌కతా పోలీసులు లాఠీచార్జి చేశారు.  వారిపై నీటిని విరజిమ్మారు.

కొత్తగా రాష్ట్రం నుండి ఎన్నికైన మొత్తం 18 మంది బిజెపి ఎంపీలు ఈ నిరసనలో పాల్గొన్నారు. నిరసనలు తెలిపేందుకు బీజేపీ శ్రేణులు సంసిద్ధమవడంతో నిత్యం రద్దీగా ఉండే సెంట్రల్‌ కోల్‌తాలో వీధుల్లో పోలీసులు  పెద్దసంఖ్యలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. తృణమూల్‌ దాడులను నిరసిస్తూ బీజేపీ నేతలు కైలాష్‌ విజయవర్గీయ, దిలీప్ ఘోష్, లాకెట్‌ ఛటర్జీ తదితరులు కోల్‌కతా పోలీస్‌ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు.

పోలీసులతో తమ నిరసనలను అడ్డుకోలేరని బిజెపి నేతలు స్పష్టం చేశారు. కలకత్తా వీధులు మమతా బనెర్జీకి చెందినవి కావని ధ్వజమెత్తారు .