రోదసీ పోరుకు కూడా సిద్ధపడుతున్న భారత్ !

ఇప్పటి వరకూ భూ, జల, గగనతల పోరాటాలకు మాత్రమే పరిమితమైన భారత్‌ త్వరలో రోదసీ పోరుకు కూడా సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన అత్యాధునిక ఆయుధ, సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు వీలుగా కొత్త సంస్థను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 'రక్షణ రోదసీ పరిశోధనా సంస్థ (డిఎస్‌ఆర్‌ఓ) పేరుతో ఈ సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన భేటీలో భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదముద్ర వేసినట్లు రక్షణ మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి.

కొద్దికాలం క్రితమే అత్యున్నత స్థాయిలో ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం సంయుక్త కార్యదర్శి స్థాయిలో వున్న శాస్త్రవేత్త సారధ్యంలో ఈ సంస్థను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. త్రివిధ దళాలు, రక్షణశాఖ అధికారుల సన్నిహిత సమన్వయంతో పరిశోధనలు నిర్వహించే శాస్త్రవేత్తల బృందాన్ని ఈ సంస్థకు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం త్రివిధ దళాధిపతులు సభ్యులుగా వున్న డిఫెన్స్‌ స్పేస్‌ ఏజెన్సీ (డిఎస్‌ఎ)కి ఈ సంస్థ పరిశోధన, అభివృద్ధి మద్దతును సమకూరుస్తుంది.

రోదసీ పోరాటాలలో దేశానికి సహకరించే లక్ష్యంతో డిఎస్‌ఎను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం ఉపగ్రహ విధ్వంసక వ్యవస్థను ప్రయోగాత్మకంగా పరిశీలించింది. సైబర్‌, రోదసీ యుద్ధ తంత్రాలను ఎదుర్కొనేందుకు వీలుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్స్‌ డివిజన్‌తో ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేస్తోంది. ఈ సంస్థలు దేశం వెలుపలి, లోపలి నుండి వచ్చే ముప్పులను గుర్తించి ఎదుర్కొనేందుకు ప్రత్యేక ఆపరేషన్స్‌ చేపడతాయి.