వందల కోట్లు కొల్లగొట్టిన మన్సూర్ తో కర్ణాటక సీఎం!

ప్రముఖ జువెలరీ సంస్థ అధినేత, సామాన్య ప్రజల నుంచి వందల కోట్ల రూపాయలను దోచుకుపోయిన ఐఎంఏ యజమాని మన్సూర్ తో కలిసి కర్ణాటక ముఖ్యమంత్రి  కుమారస్వామి కలిసున్న ఫొటో ఇప్పుడు కర్ణాటక రాజకీయాలలో దుమారం రేపుతున్నది. ఈ ఫోటోను బీజేపీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి, \"నేను తింటున్నాను... నీవు తిను\" అన్న క్యాప్షన్ పెట్టింది.

ఈ పోస్ట్ ఇప్పుడు కన్నడనాట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో ఇద్దరూ కలిసి భోజనం చేస్తున్నట్టు కనిపిస్తుండగా, మన్సూర్ లాంటి మోసగాడు ప్రజలను మోసగించి పరారయ్యాడని, అతను కుమారస్వామి మిత్రుడేనని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. నిందితుడు ముఖ్యమంత్రికి చాలా కాలంగా తెలిసిన వ్యక్తి అని, అతడిని పట్టుకోవడానికి కుమారస్వామి సంకోచిస్తున్నారని చురకలంటిస్తూ ట్వీట్‌ చేసింది.

బెంగళూరులోని శివాజీ నగరకు చెందిన ఐఎంఏ జువెల్స్‌ అనే సంస్థ  10 వేల మంది ఖాతాదారులను మోసం చేసింది. రూ.500 కోట్లకు పైగా ఖాతాదారుల సొమ్మును కాజేసి ఐఎంఏ యజమాని మహ్మద్‌ మన్సూర్‌ ఖాన్‌ నగరం విడిచి పారిపోయారు. కాగా,  ఈ కుంభకోణంలో కాంగ్రెస్‌ సీనియర్‌నేత పాత్ర కూడా ఉందంటున్న ఆడియో రికార్డర్‌ ఒకటి వైరల్‌ అవుతోంది.

ఇప్పుడు హఠాత్తుగా ఈ సంస్థ బోర్డు తిప్పేయడంతో బాధితులు వీధిన పడ్డారు. ఐఎంఏ జువెల్స్‌ కార్యాలయం ముందు బాధితులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉంటే  రూ.400కోట్లు లంచం తీసుకోవాల్సిందిగా స్థానిక అధికారులతో మన్సూర్‌ ఖాన్‌ మాట్లాడుతున్న ఆడియోలో కాంగ్రెస్‌ నేత రోషన్‌ బెయిగ్‌ ప్రమేయం కూడా కనిపిస్తోంది. మన్సూర్‌ ఖాన్‌కు అనకూలంగా రోషన్‌ మాట్లాడినట్లు ఆ ఆడియోలో రికార్డయింది.ఈ పరిణామాలతో ఖంగుతున్న కుమారస్వామి ఈ కేసును కేంద్ర నేర విభాగానికి అప్పగించనున్నట్లు ప్రకటించారు.