తెలంగాణాలో బిజెపి మరింతగా బలోపేతం

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం అయ్యే దిశగా ముందుకెళ్తోందని ఆ పార్టీకి చెందిన నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అర్వింద్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ నుండి బీజేపీ మూడు ఎంపీ సీట్లను గెలవడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ తరఫున ఎన్నికైన ఎంపీటీసీలు, జడ్పీటీసీలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎం.పీ అర్వింద్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు బీజేపీ పట్ల, ప్రత్యేకించి ప్రధాని నరేంద్రమోదీ పాలన పట్ల ఆకర్షితులవుతున్నారని చెప్పారు. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా దేశాభ్యున్నతే ధ్యేయంగా మచ్చలేని పాలన అందిస్తున్న మోదీ నాయకత్వాన్ని రానున్న రోజుల్లో మరింతగా బలపర్చనున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో  టీఆర్‌ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను గమనిస్తున్న ఓటర్లు పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. హిందువులను కించపర్చేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా కరీంనగర్‌లో వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సరికాదని స్పష్టం చేశారు. ఎంఐఎం, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుండటాన్ని గమనించిన ప్రజలు, ఆ పార్టీల వైఖరిని వ్యతిరేకిస్తూ బీజేపీ అభ్యర్థులను గెలిపించారని తెలిపారు.

ఈ సందర్భంగా సమావేశంలో బీజేపీ పార్టీ తరఫున నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలు, జడ్పీటీసీలను ఘనంగా సన్మానించారు. బీజేపీ జడ్పీటీసీలు ఎర్రం యమున, మేక విజయతో పాటు మరో 35 మంది ఎంపీటీసీలు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేయాలని, సమస్యల పరిష్కారానికి తనవంతు తోడ్పాటును అందిస్తానని ఎంపీ అర్వింద్ భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు యెండల లక్ష్మినారాయణ, గీతారెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బస్వా లక్ష్మీనర్సయ్య, పీ.వినయ్‌కుమార్, భరత్‌భూషణ్, యెండల సుధాకర్, న్యాలం రాజు, కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీకంపల్లి నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీగా ఎన్నికైన దేవన్న అర్వింద్ సమక్షంలో బీజేపీలో చేరగా, ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.