బెంగాల్‌లో మరో బిజెపి నేత దారుణ హత్య

పశ్చిమ బెంగాల్‌లో వరుస రాజకీయ హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం ఇప్పటివరకు జరిగిన హింసాయుత సంఘటనలలో కనీసం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎనిమిది మంది వరకు బిజెపి కార్యకర్తలే. తాజాగా భారతీయ జనతా పార్టీకి చెందిన ఆశిష్‌ సింగ్‌ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన సింగ్‌.. మాల్దాలోని ఓ ప్రాంతంలో శవమై కనిపించాడు. అతడి శరీరంపై తీవ్ర గాయాలు ఉండటంతో స్థానిక ఇంగ్లీష్‌ బజార్‌ పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. తమ పార్టీ నేతలు ఇలా వరుసగా దారుణ హత్యలకు గురవుతున్నారంటూ బిజెపి ఆందోళనకు దిగింది. సోమవారం ఈ మేరకు ‘బ్లాక్‌ డే’ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ రోజు కూడా నిర్వహించనున్నట్లు బిజెపి నేతలు తెలిపారు.

రాష్ట్రంలో జరుగుతున్న వరుస హత్యలపై  జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చేత దర్యాప్తు జరిపించాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణలో మమతా బెనర్జీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించింది.

ఇప్పటికే రాష్ట్రంలో ప్రశాంతతకు భంగం కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నోటీసు పంపించింది. బషీర్‌హాట్‌లో శనివారం జరిగిన హింసాకాండలో ఐదుగురు మరణించిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలు ముగిసినప్పటికీ హింసాకాండ కొనసాగడం పై ఆందోళన వ్యక్తం చేసింది.

కొద్ది వారాలుగా తీవ్రత తగ్గని రీతిలో హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయని, రాష్ట్ర వ్యవస్థలు విఫలమైనట్లు చెప్పడానికి అవకాశం కలుగుతోందని పేర్కొంది. ప్రజలకు భరోసా కల్పించడంలో రాష్ట్ర వ్యవస్థలు విఫలమైనట్లు కనిపిస్తోందని పేర్కొంది. శాంతి భద్రతలను కాపాడటానికి, ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని గట్టిగా సలహా ఇచ్చింది. విధి నిర్వహణలో ఉదాసీనంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.