గుజరాత్‌వైపు దూసుకొస్తున్న వాయు తుఫాన్

ఒడిశాను ఫొని తుఫాను కుదిపివేసి నెల రోజులు కూడా గడువకముందే వాయు తుఫాన్ గుజరాత్‌వైపు దూసుకొస్తున్నది. ఫొని కారణంగా ఒడిశాలో 60మందికి పైగా మరణించగా, వాయు ఎటువంటి విధ్వంసం సృష్టిస్తుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు.  

అరేబియా సముద్రంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్ప పీడనం క్రమంగా బలపడుతూ తుఫాన్ రూపాన్ని సంతరించుకున్నది. ఈ తుఫాన్‌కు వాయు అని నామకరణం చేశారు. గుజరాత్‌లోని వెరావాల్ తీరానికి 650 కి.మీ. దూరంలో ఉన్న వాయు తుఫాన్ గురువారం ఉదయం తీరాన్ని తాకవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తున్నది. ఈ తుఫాను బుధవారం ఉదయానికి పెను తుఫాన్‌గా మారే అవకాశం ఉందని తెలిపింది.

ఉత్తర దిశగా కదులుతున్న వాయు గుజరాత్‌లోని పోర్‌బందర్, మహువా మధ్య వెరావల్ వద్ద తీరాన్ని తాకవచ్చని పేర్కొంది. ఈ తుఫాన్ కారణంగా 110 నుంచి 120 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ  తెలిపింది. తుఫాన్ తీరాన్ని తాకే సమయంలో గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చని హెచ్చరించింది. ప్రభుత్వం ఇప్పటికే సౌరాష్ట్ర, కచ్‌లోని తీర ప్రాంతాల్లో జాతీయ విపత్తు సహాయ సిబ్బంది (ఎన్డీఆర్‌ఎఫ్)ను మోహరించింది. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించిన అధికారులు నౌకాశ్రయాల్లో రెండో ప్రమాద సంకేతాన్ని ఎగురవేశారు.

సముద్రంలో అలలు మీటరున్నర ఎత్తువరకు ఎగిసిపడవచ్చని అధికారులు తెలిపారు. దీంతో గుజరాత్‌లోని తీర ప్రాంతాలైన కచ్, దేవభూమి ద్వారక, పోర్‌బందర్, జునాగఢ్, డయ్యూ, గిర్ సోమ్‌నాథ్, అమ్రేలీ, భావ్‌నగర్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు నీటమునగవచ్చని భావిస్తున్నారు. లక్షద్వీప్, కేరళ, కర్ణాటక, దక్షిణ మహారాష్ట్రలో వాయు ప్రభావం స్వల్పంగా ఉండవచ్చని తెలిపారు.

వాయు తుఫాన్‌తో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం విజయ్ రూపాణి అధికారులను ఆదేశించారు. విపత్తు సమయంలో ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు తమ ప్రభుత్వ అధికారులు.. ఈ విషయంలో నైపుణ్యం ఉన్న ఒడిశా ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నారని చెప్పారు.  

వాయు తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు గుజరాత్ ప్రభుత్వ సంసిద్ధతపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 45 మంది సభ్యుల చొప్పున ఉన్న 25 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను ఇప్పటికే తీరప్రాంతాల్లో మోహరించామని అధికారులు తెలిపారు. వారికి పడవలను, చెట్టు కొమ్మలను కత్తిరించే పరికరాలను, టెలికాం వ్యవస్థను అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు. రాష్ర్టానికి చెందిన 11 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను కూడా మోహరిస్తామని చెప్పారు.