పాత్రికేయులను బహిరంగంగా బెదిరిస్తున్న కుమార స్వామి

కర్ణాటక ముఖ్యమంత్రి, జేడీఎస్ చీఫ్ కుమార స్వామి పాత్రికేయులను బహిరంగంగా బెదిరిస్తున్నారని, దూషిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఉద్దేశించి ఇచ్చిన ట్వీట్‌పై బీజేపీ కర్ణాటక శాఖ ఘాటుగా స్పందించింది. రాహుల్ గాంధీ నయవంచనకు పాల్పడుతున్నారని దుయ్యబట్టింది. 

కుమార స్వామి ప్రభుత్వం కర్ణాటకలో పాత్రికేయులపై పోలీసు చర్యలు తీసుకున్న సంఘటనలను వివరించింది. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న సంగతి తెలిసిందే.

‘‘మీ సీఎం హెచ్‌డీ కుమార స్వామి పాత్రికేయులను బహిరంగంగా బెదిరిస్తున్నారు, దూషిస్తున్నారు. టిప్పు దురాగతాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు జర్నలిస్టు సంతోష్ తమ్మయ్యను అరెస్టు చేశారు. సీఎం కుమారుడి ప్రవర్తనపై రిపోర్ట్ చేసినందుకు పాత్రికేయుడు విశ్వేశ్వర్ భట్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నయవంచనకు కచ్చితమైన మానవ రూపం మీరే’’ అని కర్ణాటక బీజేపీ ట్వీట్ చేసింది.

‘‘అన్నా హెచ్‌డీ కుమార స్వామి, మీ మిత్రుడు రాహుల్ గాంధీ మీకు వ్యతిరేకంగా బ్లాగులు రాసినవారిని లేదా మెమేలు పోస్ట్ చేసినవారిని అరెస్టు చేసి మీరు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని అనుకుంటున్నారు. కానీ మీ పేరు చెప్పడానికి ఆయన భయపడుతున్నారు, ఎందుకంటే మీరు ప్లగ్ లాగేసి, ప్రభుత్వాన్ని కూల్చేస్తే, ఆయన పార్టీ కర్ణాటకలో అధికారాన్ని కోల్పోతుందని భయపడుతున్నారు. ఆయన చెప్పింది వినండి’’ అని ట్వీట్ చేసింది.