డెంగీ, మలేరియా ప్రబలడంపై చంద్రబాబు అల్టిమేటం

రాష్ట్రంలో డెంగీ, మలేరియా ప్రబలడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు అల్టిమేటం ఇచ్చారు. సోమవారానికల్లా వాటిని అదుపులోకి తీసుకు రానిపక్షంలో ఎక్కడి వారిని అక్కడనే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. ఈ వ్యాధులపై జరిపిన టెలికాన్ఫరెన్స్ లో జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, డిఎంహెచ్ వోలు,ఎమ్మెల్యేలు,ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత వారం రోజులుగా పరిస్థితులు తీవ్రంగా పరిణమిస్తున్నా అదుపుకు తీసుకు రాలేక పోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. 

అందరు పరిస్థితి తీవ్రతను గుర్తించి పనిచేయాలని చెబుతూ సోమవారానికల్లా మార్పు రాకపోతే స్పాట్ లోనే సస్పెండ్ చేస్తానని స్పష్టం చేశారు. అసమర్ధతను,నిర్లక్ష్యాన్ని సహించే ప్రసక్తేలేదు. బాధ్యతారాహిత్యాన్ని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు పూర్తి బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.


"మనం ఉన్నది ప్రజల కోసమే, వారికి సేవలు అందించడం కోసమే. ఎందుకు నియంత్రించలేక పోతున్నారు..? ఎక్కడ మీరు విఫలం అయ్యారు..?అక్కడే ఎందుకని మకాం వేసి సకాలంలో చర్యలు తీసుకోలేదు..?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

సమాచారం ఉందిని, ఏం చేయాలో తెలుసని అంటూ మరెందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. కొందరు చేసిన తప్పులకు అందరికీ చెడ్డపేరు రావడాన్ని సహించనని,
విధి నిర్వహణలో అలక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు,ఎంపిలు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. ప్రజల యోగక్షేమాలు విచారించాలని హితవు చెపాప్రు. వ్యాధిగ్రస్తులకు వైద్యసేవలు అందేలా శ్రద్ధ వహించాలని చెపాప్రు.

ఈ రెండు రోజులు అసెంబ్లీకి సెలవులు,ఎంపిలకు కూడా పార్లమెంట్ లేద కాబట్టి ప్రజా ప్రతినిధులు అంతా క్షేత్ర స్థాయిలో పర్యటించాలని సూచించారు. ఆరోగ్య జాగ్రత్తలపై ప్రదర్శనలు నిర్వహించాలని, ప్రజలను చైతన్యపరచాలని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా అంటువ్యాధుల బెడదలేక పోయినా ఒక్క విశాఖలోనే ఎందుకని ప్రబలాయని ప్రశ్నించారు. వివరణలు, సంజాయిషీలు తాను కోరుకోవడం లేదని అంటూ మన కార్యాచరణ ప్రజల కళ్లకు కనిపించాలని చెప్పారు.

పరిస్థితులు ఆందోళన కరంగా ఉంటె వైద్య, ఆరోగ్య డైరెక్టర్ ఎందుకని వెళ్లలేదని, వైద్య సఖ సలహాదారుడు ఎందుకని వెళ్ళలేదని ముఖ్యమంత్రి నిలదీశారు. ప్రతిరోజూ హెల్త్ బులెటిన్లు, శానిటేషన్ బులిటెన్లు విడుదల చేయాలని ఆదేశించారు.  విశాఖలో 72వార్డులకు ఒక్కొక్క సీనియర్ అధికారిని నియమించి, వార్డు పర్యవేక్షణ బాధ్యత అప్పగించాలని చెప్పారు. అధికారులు,సిబ్బంది ఇంటింటికి తిరగాలి.ప్రజల యోగ క్షేమాలు విచారించాలని పేర్కొన్నారు. ఎక్కడెక్కడ మురుగు నిల్వలు ఉన్నాయో పరిశీలించి యాంటి లార్వా ఆపరేషన్లు ముమ్మరం చేయాలని చెప్పారు.