ప్రతి శాఖకూ నిర్దిష్ట లక్ష్యాలు, ఐదేళ్ల ప్రణాళిక

ప్రతి మంత్రిత్వ శాఖకు స్పష్టమైన లక్ష్యాలు, నిర్దిష్ట మైలురాళ్లతో ఐదేళ్ల ప్రణాళికను రూపొందించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నతాధికారులకు  ఆదేశించారు. ప్రస్తుత స్థితిలో మార్పులు రావాలని, జీవన నాణ్యత పెరగాలని కోరుకుంటున్న ప్రజాతీర్పునకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని సూచించారు. కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ఏర్పాటైన సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. ప్రతి శాఖ ప్రభావవంతమైన నిర్ణయాలతో ముందుకు సాగాలని, ఇందుకోసం వంద రోజుల వ్యవధిలో ఆమోదాలు లభించాలని చెప్పారు. 

ప్రజలు మెరుగైన జీవనాన్ని వాంఛిస్తున్నారని, ప్రభుత్వం వారి జీవనం సాఫీగా సాగడంపై దృష్టి సారించాలని కోరారు. భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశగా అధికారులు కృషి ప్రారంభించాలని దిశానిర్ధేశం చేశారు. ప్రజల భారీ ఆకాంక్షలను సవాలుగా భావించవద్దని, లక్ష్యాలను సాధించేందుకు ప్రభుత్వం ముందున్న మంచి అవకాశంగా చూడాలని సూచించారు. భారతీయ ఓటరు వచ్చే ఐదేళ్ల కోసం ఓ దృష్టికోణాన్ని అందించారని, ఇది కొత్త ప్రభుత్వం ముందు ఒక అవకాశమని చెప్పారు. 

పెరుగుతున్న జనాభాను సమర్థంగా ఉపయోగించుకోవడం అత్యవసరమని పేర్కొన్నారు. ‘భారత్‌లో తయారీ’ ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ ఈ దిశగా పురోగతి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. నీరు, మత్స్య, పశుపోషణ కూడా ప్రభుత్వానికి ముఖ్యమైన విభాగాలని తెలిపారు. ప్రజలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారని, ఈ ఘనత అధికారుల బృందం మొత్తానికీ చెందుతుందని చెప్పారు. తన బృందం తనకు గర్వకారణమని వ్యాఖ్యానించారు. 

సమావేశంలో భాగంగా అధికారులతో సంభాషించారు. చర్చను కేబినెట్‌ కార్యదర్శి పీకే సిన్హా ప్రారంభించారు. క్రితంసారి ప్రధాని అధికారులతో నేరుగా అనుసంధానమైన తీరును సిన్హా గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా కార్యదర్శులు వివిధ రంగాలకు సంబంధించి తమ ఆలోచనలను పంచుకున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. సమావేశంలో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌షా, నిర్మలాసీతారామన్‌, జితేంద్రసింగ్‌ పాల్గొన్నారు.