బిజెపి సంస్థాగత ఎన్నికలపై అమిత్ షా దృష్టి

బీజేపీలో సంస్థాగత ఎన్నికలకు అధ్యక్షుడు అమిత్ షా శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 13న పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర విభాగాల అధినేతలతో సమావేశం కాబోతున్నారు. ఈ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ అమిత్ షా వారసుని ఎంపికతో ముగుస్తుంది. బీజేపీలో అధ్యక్ష పదవి తర్వాత ప్రధాన కార్యదర్శి పదవే కీలకం. ఇది రాష్ట్ర స్థాయిలోనైనా, జాతీయ స్థాయిలోనైనా అంతే ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. 

ఈ నెల 13న మొదలయ్యే ఈ సంస్థాగత సమావేశాలు ఆ మర్నాడు కూడా కొనసాగవచ్చునని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. బీజేపీ అధ్యక్షునిగా అమిత్ షా మూడేళ్ళ పదవీ కాలం ఈ ఏడాది మొదట్లోనే ముగిసినప్పటికీ లోక్‌సభ ఎన్నికల కారణంగా ఎన్నికలను నిలిపి వేసి అమిత్ షాను కొనసాగించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య స్థాయిలో 303 సీట్లను గెలుచుకోవడంతో ఇప్పుడు ఆయన సంస్థాగత ఎన్నికలపై దృష్టి పెట్టి మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేస్తున్నారు.

ఇప్పటికే మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా బీజేపీ విభాగాల నేతలతో ఆయన చర్చలు జరిపారు. ఈ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడానికి మూడు నెలల వ్యవధి పడుతుందని దాదాపు 50 శాతం రాష్ట్రాల్లోనూ కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాతే ఏకాభిప్రాయ ప్రాతిపదికన పార్టీ అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందని మరో సీనియర్ నాయకుడు తెలిపారు. 

లోక్‌సభ ఎన్నికల్లో గాంధీ నగర్ స్థానం నుంచి గెలుపొందిన అమిత్ షాను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పార్టీ అధ్యక్ష పదవిలో ఆయన కొనసాగే అవకాశం లేదన్న విషయం స్పష్టమవుతోంది. అయితే ఇందుకు సంబంధించి అధికారికంగా బీజేపీ ఎలాంటి సంకేతాలు అందించడం లేదు. ఇప్పటికే అమిత్ షా వారసత్వానికి జేపీ నడ్డా, భూపేంద్ర యాదవ్‌లు పోటీ పడుతున్నారు.