అమెరికా వాణిజ్య విభేదాలపై మోడీ, జిన్‌పింగ్‌ చర్చ

షాంఘై సహకార సంఘం (ఎస్‌సిఓ) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు సి జిన్‌ పింగ్‌, ప్రధాని మోడీ సమావేశమై అమెరికాతో ఎదుర్కొంటున్న వాణిజ్య విబేధాలపై చర్చించనున్నట్లు చైనా సోమవారం వెల్లడించింది. ఈ సందర్భంగా సి జిన్‌పింగ్‌, మోడీలను మంచి మిత్రులుగా పేర్కొంది. కిర్గిజ్‌ రాజధాని బిష్‌కెక్‌లో ఈ నెల 13, 14 తేదీలలో షాంఘై సహకార సంఘం శిఖరాగ్ర సదస్సు జరగనున్నది. 

ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు సి జిన్‌ పింగ్‌, భారత్‌ ప్రధాని మోడీ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ ప్రత్యేకంగా సమావేశమై అమెరికా అనుసరిస్తున్న వాణిజ్య రక్షణ వాదాన్ని వ్యతిరేకించే విషయమై ఏకాభిప్రాయానికి రానున్నారని చైనా విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఝాంగ్‌ హన్‌హురు మీడియాకు తెలిపారు. ఇదే సమావేశంలో ద్వైపాక్షిక, అంతర్జాతీయ సమస్యలను కూడా వారు చర్చించను న్నారని తెలిపారు. 

భారత ప్రధానిగా మోడీ రెండో సారి పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఇరు దేశాల నేతలు తొలిసారిగా సమావేశం అవుతుండటంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానిగా మోడీ రెండో సారి బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయనకు అభినందనలు తెలియచేస్తూ సి జిన్‌ పింగ్‌ మే 23న లేఖ రాసిన సంగతి తెలిసిందే. గత ఏడాది వూహన్‌లో జరిగిన శిఖరాగ్ర సదస్సు కూడా భారత్‌ చైనాల సంబంధాల అభివృద్ధి కోసం వ్యూహాత్మక మార్గదర్శకాలను అందించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.