2019లోనూ మరిన్ని సీట్లతో `అజేయ బీజేపీ’

వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేసారు. సొంత బలంతో అధికారంలోకి వచ్చిన గత ఎన్నికలలో కన్నా ఈ పర్యాయం ఎక్కువ సీట్లు వస్తాయని ఆయన భరోసా వ్యక్తం చేసారు.

ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ప్రారంభిస్తూ సంపూర్ణ మెజారిటీతో గెలుస్తామని, సంకల్ప బలం ఉందని, మమ్మల్ని ఎవరూ ఓడించలేరని షా ప్రకటించారు. అంతకు ముందు జరిగిన పార్టీ ఆఫీసు బేరర్ల సమావేశంలో 2019 ఎన్నికలకు `అజేయ బిజెపి’ నినాదంతో వెళ్ళాలని నిర్ణయించారు. అంటే బిజెపిని వాదించే శక్తీ ఎవ్వరికీ లేదనే ధీమాతో ప్రజల వద్దకు వెళ్ళాలని నిర్ణయించారు.

సుమారు సంవత్సరం కాలం తర్వాత జరుగుతున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో వచ్చే లోక్ సభ ఎన్నికలకు పార్టీ వ్యూహాన్ని ఖరారు చేయడంతో పాటు ఈ సంవత్సరం చివరిలో జరుగనున్న నాలుగు రాష్త్రాల ఎన్నికలు, ముందస్తు ఎన్నికల అవకాశం ఉన్న తెలంగాణలోని రాజకీయ పరిస్థితులను గురించి కుడా చర్చిస్తారు. జాతెయ కార్యవర్గ సభ్యులతో పాటు పార్టీ రాష్ట్ర శాఖల అద్యక్షులు, శాసన సభలలో పార్టీ పక్ష నాయకులు కుడా పాల్గొంటున్నారు. ఆదివారం ముగింపు సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు.

కాగా, బిజెపి పాలనపై ప్రతిపక్షాల విమర్శలను, ముఖ్యంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదల, రూపాయి పతనం వంటి అంశాలపై సహితం సమావేశం ధీటైన జవాబు ఇవ్వగలదని భావిస్తున్నారు. సమావేశంలో మూడు తీర్మానాలను ఆమోదిస్తున్నట్లు పార్టీ ప్రతినిధులు తెలిపారు.

ఇలాఉండగా, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా నాయకత్వంలోనే 2019 సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవాలని పార్టీ నిర్ణయించింది. అందుకు వీలుగా పార్టీ సంస్థాగత ఎన్నికలను వాయిదా వేయాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించింది.

 షెడ్యూల్ ప్రకారం అమిత్‌ షా పదవీకాలం 2019 జనవరితో ముగియాల్సి ఉంది. అయితే సంస్థాగత ఎన్నికలను వాయిదా వేయిడం ద్వారా అమిత్‌షా నాయకత్వంలోనే సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవాలని పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అమిత్‌షా 2014 ఆగస్టులో పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. అంతకుముందు పార్టీ అధ్యక్షుడుగా ఉన్న రాజ్‌నాథ్ సింగ్ మోదీ మంత్రివర్గంలో హోం మంత్రిగా చేరడంతో అమిత్‌ షా పార్టీ పగ్గాలు అందుకున్నారు. రాజ్‌నాథ్ పూర్తి చేయాల్సిన మూడేళ్ల పదవీ కాలాన్ని షా పూర్తి చేశారు. 2016 జనవరిలో మొదటి టర్మ్ మూడేళ్ల కాలం పూర్తి చేసుకున్నారు. బీజేపీ రాజ్యాంగం ప్రకారం, ఒక వ్యక్తి రెండుసార్లు (ముడేళ్ల కాలపరిమితి చొప్పున) పార్టీ అధ్యక్షుడిగా పనిచేయవచ్చు.