శంషాబాద్‌ విమానాశ్రయంలో హై అలర్ట్‌

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం నుంచి హై అలర్ట్‌ కొనసాగుతున్నట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు ప్రకటించాయి. ఈనెల 7వ తేదీ నుంచి 31వ తేదీ వరకు విమానాశ్రయంలో ఆంక్షలు ఉంటాయి. భద్రత కారణంగా ఎయిర్‌పోర్టుకు వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

 

ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి ఔటర్‌రింగు రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే వైపు నుంచి ఎయిర్‌పోర్టుకు వచ్చే ప్రధాన రహదారిలో ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వారి నుంచి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

 

ఎయిర్‌పోర్టు పాసింజర్‌ టెర్మినల్‌లోని ఇంటర్నేషనల్‌ అరైవల్‌ డిపార్చర్‌తో పాటు కార్గో, పాసింజర్‌ టెర్మినల్‌ కార్గో టెర్మినల్‌, వీఐపీ, వీవీఐపీ గేటు ప్రాంతాల్లో సాయుధులైన సెంట్రల్‌ ఇండియన్‌ సెక్యూరిటీ ఫోర్సు (సీఐఎస్‌ఎఫ్‌) జవాన్లు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఎయిర్‌పోర్టు పరిసరాల్లో అనుమానాస్పదంగా బ్యాగులు, ఇతర మూటలు కనిపిస్తే డాగ్‌స్క్వాడ్‌, బాంబ్‌ స్క్వాడ్‌లతో తనిఖీలు చేస్తున్నారు.

పార్కింగ్‌ ఏరియాలో నిబంధనల కంటే ఎక్కువ సమయం నిలిపి ఉన్న వాహనాలను సైతం తనిఖీలు చేస్తున్నారు. ఎయిర్‌పోర్టులో అన్ని రకాల పాసులను ఈ నెల 31వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. ఎయిర్‌పోర్టులో భద్రతా విధులు నిర్వహించే సీఐఎ్‌సఎ్‌ఫతో పాటు సైబరాబాద్‌, ఇంటలిజెన్స్‌ అధికారులు సంయుక్తంగా భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నివారించేందుకు రాత్రింబవళ్లు గస్తీ తిరుగుతున్నారు.