కథువా అత్యాచార కేసులో ముగ్గురికి జీవితఖైదు

ఏడాదిన్నర క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జమ్ముకశ్మీర్‌లోని కథువా అత్యాచార ఘటనలో పఠాన్‌కోట్‌ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సాంజీరామ్‌తో పాటు దీపక్‌ ఖజూరియా, పర్వేశ్‌కుమార్‌లకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.  

దోషులుగా తేలిన మరో ముగ్గురు పోలీసులు ఎస్‌ఐ ఆనంద్‌ దత్త, హెడ్‌ కానిస్టేబుల్‌ తిలక్‌ రామ్‌, ప్రత్యేక పోలీసు అధికారి సురేందర్‌ వర్మలకు ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. 

ఈ కేసులో మొత్తం ఏడుగురిని పోలీసులు నిందితులుగా పేర్కొనగా.. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా సాంజీరామ్‌ కుమారుడు విశాల్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. మిగతా ఆరుగురిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం వారికి శిక్షలు ఖరారుచేసింది. 

గతేడాది జనవరిలో జమ్ముకశ్మీర్‌లోని కథువాకు చెందిన 8ఏళ్ల చిన్నారిని అతి పాశవికంగా అత్యాచారం చేసి చంపిన విషయం తెలిసిందే. కథువాలోని రసానా గ్రామానికి చెందిన ఈ చిన్నారి 2018 జనవరి 10న గుర్రాలను మేపడానికి వెళ్లి అదృశ్యమైంది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అయితే సరిగ్గా వారం రోజుల తర్వాత జనవరి 17న గ్రామానికి సమీపంలోని ఓ అటవీప్రాంతంలో బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిర్వహించగా.. బాలికను అతి దారుణంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది. చిన్న భూవివాదం కారణంగా ఏర్పడిన విద్వేషంతో అభం శుభం తెలియని చిన్నారిపై కొందరు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. 

రసానా గ్రామంలో బక్రవాల్‌ అనే సంచార తెగవాసులు గుర్రాలను మేపుకుంటూ ఉంటారు. భూముల వ్యవహారం, పొలాల్లో గుర్రాలను మేపే అంశంపై ఈ తెగవారికి, గ్రామస్థులకు మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో రెవెన్యూశాఖ మాజీ ఉద్యోగి అయిన సాంజీ రామ్‌.. బక్రవాల్‌ తెగపై కక్ష పెంచుకున్నాడు. ఆ సంచార తెగను ఆ ప్రాంతం నుంచి తరిమేయాలనుకున్నాడు. ఇందుకోసం ఓ పథకం రచించాడు. 

గుర్రాలు మేపేందుకు వెళ్లిన బాలికను ఎత్తుకెళ్లి సమీపంలోని ఓ గుడిలో బంధించారు. అక్కడ ఆమెకు మత్తుమందు ఇచ్చి సాంజీరామ్‌, ఇతర వ్యక్తులు అత్యాచారం చేశారు. ఆ తర్వాత బాలికను రాయితో కొట్టి చంపి అడవిలో పడేశారు. అక్కడితో ఆగకుండా ఈ ఘోరాన్ని కప్పిపుచ్చేందుకు సాంజీరామ్‌ స్థానిక పోలీసులకు పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చాడు. ఆ తర్వాత హత్యోదంతం వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంజీరామ్‌తో పాటు ఏడుగురిని నిందితులుగా చేర్చారు. 

తొలుత ఈ కేసును జమ్ముకశ్మీర్‌ న్యాయస్థానం క్రైమ్‌ బ్రాంచికి అప్పగించింది. అయితే దర్యాప్తునకు అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కేసు సుప్రీంకోర్టుకు వెళ్లింది. అనంతరం అత్యున్నత న్యాయస్థానం  పంజాబ్‌లోని  పఠాన్‌కోట్‌ కోర్టుకు కేసును బదిలీ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పఠాన్‌కోట్‌ న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించింది.