ఏపీలో నాలుగు గిరిజన జిల్లాల ఏర్పాటు!

ఏపీలో జిల్లాల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 13 నుండి 25కు పెంచాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించిన సందర్భంగా గిరిజనులు అత్యధికంగా నివశించే ప్రాంతాలలో నాలుగు ప్రత్యేక జిల్లాలు ఏర్పాటు చేయాలని సిసిఎల్‌ఏ నేతృత్వంలోని కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు తెలిసింది.  నూతన జిల్లాల ఏర్పాటుపై ఇప్పటికే పనిచేస్తున్న ఈ కమిటీ గిరిజనులు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొత్త జిల్లాలను ప్రతిపాదించినట్లు తెలుస్తున్నది. 

ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనల్లో అరకు, పార్వతీపురం, రంపచోడవరం, పోలవరం కేంద్రాలుగా నూతన జిల్లాలను ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలిసింది. స్థానిక ప్రజల అభివృద్ధి. ప్రాధమిక సౌకర్యాల కల్పన ప్రాధమిక లక్ష్యాలుగా ఈ ప్రతిపాదనలు రూపొందించినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు కమిటీ నుండి అందిన ప్రాధమిక సమాచారానికి ప్రభుత్వ పెద్దలు సైతం సానుకూలంగానే స్పందించినట్లు తెలిసింది. 

దీంతో గిరిజన జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలపై కమిటీ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అరకు పార్లమెంట్‌ నియోజకవర్గంలో మూడు గిరిజన జిల్లాలను. ఏలూరు పార్లమెంటు పరిధిలోని పోలవరాన్ని మరో గిరిజన జిల్లాగానూ కమిటీ ప్రతిపాదించింది. 

అరకు పార్లమెంటరీ నియోజక వర్గం పరిధిలో నూతనంగా ప్రతిపాదించిన పార్వతీపురం జిల్లాలోకి ప్రస్తుత శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఉన్న పాలకొండ, కురుపాం, పార్వతీపురం,సాలూరు అసెంబ్లీ నియోజక వర్గాలను చేర్చ్రాలని ప్రతిపాదించింది. ప్రస్తుత విశాఖ జిల్లాలోని అరకు , పాడేరు నియోజకవర్గాలతో నూతనంగా అరకు జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రతిపా దించింది. 

అరకు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గాన్ని అదే పేరుతో నూతన జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని సైతం మరో గిరిజన జిల్లాగా ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మిగిలిన ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలతో మరో జిల్లాను ఏర్పాటు చేయాలని కమిటీ ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే, అది గిరిజనులు అధికంగా ఉండే జిల్లాగా ఉండదు.  

నూతన జిల్లాల ఏర్పాటుకు సంబంధించి నూతన రాష్ట్ర ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయక పోయినా అంతర్గతం తగా ఇప్పటికే సిసిఎల్‌ఎ నేతృత్వంలోని కమిటీ విస్తృతంగా పనిచేస్తోంది. ఈ కమిటీలో రెవిన్యూశాఖకు చెందిన స్పెషల్‌ సిఎస్‌, పంచాయతీరాజ్‌, పురపాలన, ప్రణాళిక, ఐటి, ఫైనాన్స్‌, గిరిజనసంక్షేమ శాఖలకు చెందిన ముఖ్యకార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు.

ఈ కమిటీ ఇప్పటికే క్షేత్రస్థాయికి సంబంధించిన పలు వివరాలను సేకరించింది.జిల్లాల కలెక్టర్ల నుండి కూడా సమాచారం తీసుకుంది. వీటి ఆధారంగా ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల్లో స్థానంలో 25 జిల్లాలను ప్రతిపాదించి నట్లు సమాచారం. మరో జిల్లా కూడా పెరిగే అవ కాశం ఉందని తెలిసింది. దీనిలో భాగంగా రెవెన్యూ డివిజన్లను పునర్విభజన చేయాల్సి ఉంటుందని, పునర్విభజన అనంతరం పాత జిల్లాల్లో 7, నూతన జిల్లాల్లో తొమ్మిందింటికి మధ్యస్థంగా వున్న ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా గుర్తించాల్సి ఉంటుం దని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.