బిసిల కోసం కృష్ణయ్య కొత్త పార్టీ

తెలుగు రాష్త్రాలలో బిసిల కోసం కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ఎన్‌.చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖర్‌రావులు బీసీలపట్ల అవలంబిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ  రాజకీయ పార్టీ పెట్టడం కోసం సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిపారు. ముందుగా బీసి పార్టీని ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పాటు చేయగలనని చెప్పారు.

 ‘ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ బహిరంగ సభ పెట్టినా బీసీలంతా మన కోసం పార్టీ పెట్టన్నా..’అని అడుగుతున్నారని చెబుతూ పార్టీ ఏర్పాటుపై చర్చలు సాగుతున్నాయని పేర్కొన్నారు. మొన్న గుంటూరు, నిన్న విజయవాడ, అంతకుముందు వరంగల్‌లో పెట్టిన సభల్లో చాలామంది ‘ఈ అగ్రకుల పార్టీల నేతలు మనకు సరైన ప్రాధాన్యతను ఇవ్వట్లేదు, ఎంతసేపు మనల్ని అడుక్కుతినే వాళ్లల్లానే చేస్తున్నారు, సీట్ల విషయంలో మొండిచెయ్యి చూపుతున్నారు, కాబట్టి నువ్వు పార్టీ పెట్టాల్సిందే’అని అంటున్నారని చెప్పారు.

 పార్టీ పెట్టాల్సిన పరిస్థితి వస్తే ఏపీలోనే పెడతానని స్పష్టం చేసారు. ఏపీలోనే బీసీలకు ఎక్కువ అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కాగా వచ్చే ఎన్నికలలో ఎక్కడ నుంచి, ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనే విషయాన్ని కార్యకర్తలతో చర్చించి వారంలోగా వెల్లడిస్తానని చెప్పారు.   

ఇట్లా ఉండగా, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని కృష్ణయ్య ఆరోపించారు. అసెంబ్లీని రద్దు చేసి 125 మంది ఎమ్మెల్యేలను రోడ్డున పడేసి, ఆయన మాత్రం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పీఠంలో కొనసాగడమేమిటని ప్రశ్నించారు. తక్షణం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో బీసీలకు 65 సీట్లు ఇవ్వాలని, లేదంటే బీసీలందరం కలసి ఓడిస్తామని హెచ్చరించారు.