పశ్చిమ బెంగాల్లో హింసాత్మక సంఘటనలు కొనసాగుతుండటం పట్ల కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. లోక్సభ ఎన్నికలు ముగిసినప్పటికీ, శాంతిభద్రతలను కాపాడటంలో రాష్ట్ర యంత్రాంగం విఫలమవడం పట్ల స్పందించింది. ప్రజల ప్రశాంతతకు భంగం కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నోటీసు పంపించింది.
బషీర్హాట్లో శనివారం జరిగిన హింసాకాండలో ఐదుగురు మరణించారు. లోక్సభ ఎన్నికలు ముగిసినప్పటికీ హింసాకాండ కొనసాగడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. కొద్ది వారాలుగా తీవ్రత తగ్గని రీతిలో హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయని, రాష్ట్ర వ్యవస్థలు విఫలమైనట్లు చెప్పడానికి అవకాశం కలుగుతోందని పేర్కొంది.
ప్రజలకు భరోసా కల్పించడంలో రాష్ట్ర వ్యవస్థలు విఫలమైనట్లు కనిపిస్తోందని పేర్కొంది. శాంతి భద్రతలను కాపాడటానికి, ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని గట్టిగా సలహా ఇచ్చింది. విధి నిర్వహణలో ఉదాసీనంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
బషీర్హాట్లోని భంగిపరలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య శనివారం జరిగిన ఘర్షణల్లో ఐదుగురు మరణించినట్లు సమాచారం. ఇదిలావుండగా, పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం.
రాష్ట్రంలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి సోమవారం ప్రధాని నరేంద్రమోదీని కలువనున్నారు. రెండోసారి ప్రధానిగా ఎన్నికైన నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపేందుకు మాత్రమే మోదీని కలువనున్నట్టు గవర్నర్ చెప్పారు. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై వివరించేందుకు తాను ప్రధానిని కలువనున్నట్టు మీడియాలో వచ్చిన కథనాలను ఆయన ఖండించారు.
ఇలా ఉండగా, తమ పార్టీకి చెందిన ఇద్దరి మృతదేహాలను బాసిర్హాత్ నుంచి కోల్కతాకు తరలించేందుకు బిజెపి చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. తమ కార్యకర్తల మృతదేహాలను కోల్కతాలోని ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లాలని భాజపా నేతలు భావించారు. రాష్ట్ర హైవేపై వాహనాలను అడ్డుగా పెట్టి, ఈ ప్రయత్నాన్ని పోలీసులు నిలువరించారు.
ఘర్షణలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కారకురాలని, ఆమె విద్వేషాలను రెచ్చగొడుతున్నారని బిజెపి నేత ముకుల్ రాయ్ ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో సోమవారం 12 గంటల పాటు బంద్కు బిజెపి పిలుపునిచ్చింది. ఈ నెల 12న కోల్కతాలో నిరసన ప్రదర్శన కూడా నిర్వహించనున్నట్లు తెలిపింది.