శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ

కలియుగ దైవం వేంకటేశ్వరస్వామిని ప్రధాని మోదీ దర్శించుకున్నారు. రేణిగుంట సమీపంలోని బిజెపి  ‘ప్రజా ధన్యవాద సభ’ను ముగించుకుని నేరుగా తిరుమలలోని పద్మావతి అతిథి గృహం వద్దకు చేరుకున్న ప్రధానికి గవర్నర్‌ నరసింహన్‌, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తో పాటు టీటీడీ ఈవో అనీల్‌కుమార్‌ సింఘాల్‌, ఇతర అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు.

అక్కడ కాసేపు విశ్రాంతి తర్వాత మోదీ శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లారు. ప్రధానితోపాటు గవర్నర్‌ నరసింహన్‌, సీఎం జగన్‌ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించిన మోదీ, నరసిం‍హన్‌, వైఎస్‌ జగన్‌ తిరుమలేశుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయంలో శ్రీవారిని దర్శించిన అనంతరం.. విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. 

స్వామివారి హుండీలో ప్రధాని మోదీ కానుకలు సమర్పించారు. ఆలయాన్ని రోజూ ఎంతమంది భక్తులు దర్శించుకుంటారంటూ.. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ప్రధాని మోదీ ఆరా తీశారు. 

అనంతరం రంగనాయకుల మండపంలో మోదీ, నరసిం‍హన్‌, వైఎస్‌ జగన్‌కు టీటీడీ అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. శ్రీవారి శేషవస్త్రాన్ని ప్రధాని మోదీకి టీటీడీ అర్చకులు అందజేశారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. శ్రీవారి చిత్రపటాన్ని మోదీకి కానుకగా ఇచ్చారు. రంగనాయకుల మండపంలో ప్రధాని మోదీ, గవర్నర్‌ నరసింహన్‌, సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీవారి ప్రసాదాన్ని ఆరగించారు. 

రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి నరేంద్రమోదీ శ్రీవారి దర్శనానికి వచ్చారు.