ఏపీకి సంపూర్ణ సహకారం : మోదీ భరోసా

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా చేయూత ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు.ఏపీ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏవిధంగానూ వెనుకడుగు వేయబోదని మోదీ హామీ ఇచ్చారు.  

 తిరుపతిలోని రేణిగుంట సమీపంలోని కార్బన్‌ పరిశ్రమ పక్కన ఏర్పాటు చేసిన బిజెపి ‘ప్రజా ధన్యవాద సభ’లో ‘నమో వేంకటేశాయ..’ అంటూ స్తోత్రంతో తెలుగులో ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. శ్రీలంక నుంచి రావడం ఆలస్యమైనందుకు తనను క్షమించాలని కార్యకర్తలను మోదీ కోరారు. 

‘‘తిరుమల వేంకటేశ్వరుడి సన్నిధిలో తలవంచి ఆశీస్సులు తీసుకుందామని వచ్చా.. దేవదేవుడి దర్శనానికి వెళ్తూ ప్రజా దేవుళ్లను సందర్శించే భాగ్యం లభించింది. తిరుపతిని అనేకసార్లు చూసే అదృష్టం నాకు లభించింది’’ అని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. 

ఏపీలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలో బలమైన ప్రభుత్వం ఏర్పడిందని సంతోషం వ్యక్తం చేశారు.  వైఎస్‌ జగన్‌ తన ఆకాంక్షలకు అనుగుణంగా, తన సంకల్పంతో మంచి పరిపాలన అందించాలని ఆకాంక్షించారు. ఏపీలో అభివృద్ధికి అన్ని అవకాశాలున్నాయని తెలిపారు. 

ఏపీ అన్నిరంగాల్లో దూసుకుపోతుందని చెబుతూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు.  రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఏపీ అభివృద్ధికి కలిసి ముందుకు సాగుతాయని చెప్పారు. 

ఏపీ ప్రజలు విజ్ఞానవంతులని ప్రధాని కొనియాడుతూ స్టార్టప్‌ కార్యక్రమంలో ఎంతో నిష్ణాతులైనవారు రాష్ట్రం నుంచి పెద్దసంఖ్యలో ముందుకొచ్చారని పేర్కొన్నారు. 

‘‘బిజెపి కార్యకర్తలు కర్మ సిద్ధాంతాన్ని విశ్వసిస్తారు. మున్సిపల్‌ వార్డు గెలవలేని రోజుల్లోనూ భారత్‌మాతాకీ జై అన్నారు. బిజెపి  కార్యకర్తలు ఎన్నికలప్పుడే ప్రజలకు కనిపించేవాళ్లు కాదు. ఎల్లప్పుడూ ప్రజలతో మమేకమై పనిచేస్తారు" అని హిత బోధ చేశారు. 

అధికారంలోకి రావడమే కాదు.. ప్రజాసేవకు అంకితమవ్వాలి. జనంలో.. జనంతో ఉంటేనే ప్రజా హృదయాలు గెలుస్తాం. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కనబరిచిన ఏపీ, తమిళనాడు ప్రజలకు అభినందనలు. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తానని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.