బెంగాల్ లో ముగ్గురు బిజెపి కార్యకర్తల మృతి

పశ్చిమ బెంగాల్‌లో తమ ఓటమిని జీర్ణించుకోలేని తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు బిజెపి కార్యకర్తలపై హత్యా రాజకీయాలు కొనసాగిస్తున్నారు. దానితో ఎన్నికలు ముగిసినా ఘర్షణలు తలెత్తుతూనే ఉన్నాయి.

తాజాగా శనివారం రాత్రి ఇరు పార్టీల కార్యకర్తల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణలో ముగ్గురు బిజెపి  కార్యకర్తలు మృతి చెందినట్లు రాష్ట్రంలో ఆ పార్టీ కీలక నేత ముకుల్‌ రాయ్‌ వెల్లడించారు. టీఎంసీ శ్రేణులే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఆయన ఆరోపించారు.

‘‘సందేశ్‌ఖలిలో జరిగిన ఘర్షణలో బిజెపికి చెందిన ముగ్గురు కార్యకర్తలను టీఎంసీ గూండాలు చంపేశారు. ఈ హత్యలకు మమతా బెనర్జీయే బాధ్యత వహించాలి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు వివరిస్తాం’’ అని ముకుల్‌ రాయ్‌ తెలిపారు.

మరోవైపు ఈ ఘర్షణలో టీఎంసీకి చెందిన ఒక కార్యకర్త కూడా మృతిచెందినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ హత్యలను మాత్రం పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. ఈ విషయంపై స్పందించడానికి వారు నిరాకరించడం గమనార్హం.  

బెంగాల్‌లోని ఉత్తర 24 పరాగణాలు జిల్లాలో ఇరు పార్టీలకు సంబంధించిన జెండాలను తొలగించే క్రమంలో చెలరేగిన వివాదమే తీవ్ర ఘర్షణకు దారి తీసిందని చెబుతున్నారు. రాష్ట్ర బిజెపి  ప్రధాన కార్యదర్శి సయంతన్‌ బసు మాట్లాడుతూ.. ‘‘మా పార్టీకి చెందిన ముగ్గురు కార్యకర్తల మృతదేహాలు మాకు చేరాయి. మరో ఇద్దరు మరణించినట్లు కూడా మాకు సమాచారం అందింది. వారు(టీఎంసీ) మా జెండాలు, పోస్టర్లు తొలగిస్తుండగా.. మా కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తలెత్తిన ఘర్షణలో మా కార్యకర్తల్ని చంపేశారు’’ అని పేర్కొన్నారు.

బిజెపికి చెందిన పార్టీ ఎంపీ, కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో సైతం కార్యకర్తల మృతిపై విచారం వ్యక్తం చేశారు. అంతకుముందు దీనాజ్‌పూర్ జిల్లా గంగారామ్‌పూర్‌లో జరిగిన విజయోత్సవ ర్యాలీలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తలెత్తిన ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.