‘ఆయుష్మాన్ భారత్’తో 50కోట్ల మందికి ఆరోగ్యబీమా

పేదల ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం తెస్తున్న ‘ఆయుష్మాన్ భారత్’ కార్యక్రమాన్ని తెలంగాణాలో  సమర్ధవంతంగా అమలు చేయాలని బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ కోరారు. ‘ఆయుష్మాన్ భారత్, స్వచ్ఛభారత్ మిషన్’పై కేంద్ర సమాచార ప్రసార శాఖ నిర్వహించిన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ కార్యక్రమాలు మంచి ఫలితాలు సాధిస్తాయని ఆయన చెప్పారు.

‘ఆయుష్మాన్ భారత్’ ద్వారా దేశంలో యాభై కోట్ల మందికి పైగా ఆరోగ్య బీమా కలుగుతుందని డా. లక్ష్మణ్ తెలిపారు. ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షల వైద్య సాయం అందుతుందని పేర్కొన్నారు. ఈ నెల నుంచీ అమలయ్యే ఈ కార్యక్రమం పట్ల ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

పేదలకు మందులను చౌకగా అందించేందకు జనరిక్ ఔషధాల స్టోర్స్ ఏర్పాటు చేసిందని గుర్తు చేసారు. ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమం ఉద్దేశాలను సాధించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలను చేపట్టాల్సిన అవసరముందని సూచించారు. పేదల్లో ఆత్మన్యూనత తొలగించే ఉద్యమంగా ‘స్వచ్చ భారత్’ కార్యక్రమాన్ని ఆయన అభివర్ణించారు.

నాలుగేళ్లలో ఏడు కోట్ల పైగా వ్యక్తిగత టాయిలెట్లను  నిర్మించారని లక్ష్మణ్ చెప్పారు. కార్యక్రమంలో సమాచార కార్యాలయం అదనపు డైరెక్టర్ జనరల్  టీవీకే రెడ్డి,  కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం  సీనియర్ రీజనల్ డైరెక్టర్ అనూరాధ మేడోజు, లెప్రసీ మిషన్ జేడీ జాన్ బాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జేడీ సుకృతారెడ్డి, ప్రచార విభాగం జేడీ దేవేందర్ పాల్గొన్నారు.