తెలంగాణలో 32 జిల్లా పరిషత్‌లూ టిఆర్‌ఎస్‌ వశం

తెలంగాణలో 32 జిల్లా పరిషత్‌లూ  టిఆర్‌ఎస్‌   వశమయ్యాయి. అన్నిచోట్లా ఛైర్‌పర్సన్‌, వైస్‌ ఛైర్‌పర్సన్‌ స్థానాలు ఆ పార్టీకి చెందిన సభ్యులకే లభించాయి. ఆయా జిల్లాల్లో మెజార్టీ సంఖ్యలో తెరాస జడ్పీటీసీ సభ్యులు విజయాన్ని సాధించడం వల్లనే పంచాయతీరాజ్‌ వ్యవస్థలోని అతి కీలకమైన జడ్పీలన్నీ అధికార పార్టీపరం కాగలిగాయి. 

ఆదిలాబాద్‌లో చేతుతెత్తే పద్దతిలో ఎన్నికల జరగ్గా.. మిగతా అన్ని జిల్లాల్లోనూ పదవులన్నీ ఏకగ్రీవమయ్యాయి. నూతనంగా ఎన్నికైన వారు జులై 5వ తేదీన పదవీ బాధ్యతలను చేపడతారు.జడ్పీ ఎన్నికలతో పంచాయతీరాజ్‌ సంస్థల్లో ఎన్నికల ప్రక్రియ పరిసమాప్తమైంది.

ఆదిలాబాద్‌ జడ్పీకి తప్ప మిగతా అన్ని జడ్పీలకు ఒక్కో పదవికి టిఆర్‌ఎస్‌  నుంచి ఒక్కొక్క నామినేషన్‌ మాత్రమే రావడంతో అక్కడి ఎన్నికలు ఏకగ్రీవయ్యాయి. దీంతో ఎన్నికల ప్రక్రియ అన్నిచోట్లా దాదాపుగా అరగంట వ్యవధిలోనే ముగిసిపోయింది. 

ఆదిలాబాద్‌లో మొత్తం 17 జడ్పీటీసీల్లో  టిఆర్‌ఎస్‌ కు 9, బిజెపికి  5, కాంగ్రెస్‌కు 3 స్థానాలు ఉండటంతో అక్కడ పోటీకి దారితీసింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు చెందిన ఒక సభ్యురాలు  టిఆర్‌ఎస్‌  అభ్యర్థికి అనుకూలంగా చెయ్యి ఎత్తటంతో అక్కడ తెరాసకు 10 ఓట్లు లభించినట్లయింది. 

ఛైర్‌పర్సన్‌, వైస్‌ఛైర్‌పర్సన్‌ ఎన్నికలకు ముందు.. ప్రతి జడ్పీకి ఇద్దరేసి చొప్పున మొత్తం 64 కో-ఆప్టెడ్‌ సభ్యులను జడ్పీటీసీ సభ్యులు ఎన్నుకున్నారు. ఆదిలాబాద్‌తో సహా అన్ని జిల్లాల్లోను ఈ కో-ఆప్టెడ్‌ సభ్యులు ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికైన వారంతా పాలనాపగ్గాలు చేపట్టేందుకు 26 రోజులపాటు ఎదురు చూడకతప్పదు. ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం జులై 4వ తేదీన ముగుస్తుంది. ఆ మరుసటి రోజునే అన్ని జడ్పీల్లోనూ ‘మొదటి సమావేశాలను’ నిర్వహించి ఇప్పుడు ఎన్నికైనవారు, జడ్పీటీసీ సభ్యులు పదవీ ప్రమాణాలు చేస్తారు.