రోజాకు దక్కని మంత్రి పదవి !

తన మంత్రివర్గంలో 25 మందికి చోటు కల్పించిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అనేకమంది కొత్తవారికి అనూహ్యంగా స్థానం కల్పించగా,  సీనియర్ నేతలు పలువురికి ఆశాభంగం కలిగింది. వైసిపిలో తొలినుండి క్రియాశీలకంగా పాల్గొనడమే కాకుండా టిడిపి ప్రభుత్వంపై ఒంటెత్తు మాటల పోరాటం చేస్తున్న అనేకమందికి స్థానం దక్కలేదు. 

వీరందరిలో ముఖ్యంగా  చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, సినీ నటి రోజా, మంగళగిరి ఎమ్యెల్యే ఆళ్ళ రామకృష్ణల పేర్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మొదటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ రెండో సారి ఎమ్మెల్యేగా వీరిద్దరికి కేబినెట్‌లో పెద్ద పోస్టే దక్కుతుందని మొదటి నుంచి ఊహాగానాలు వినిపించాయి. స్వయంగా జగన్ కొన్ని సందర్భాలలో ఆ మేరకు హామీ ఇచ్చారు కూడా. నిత్యం కోర్ట్ కేసులతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును రామకృష్ణ ఉక్కిరి బిక్కిరి చేయగా, రోజాను చూస్తేనే చంద్రబాబు ఉలిక్కి పడుతూ ఉండేవారు.

శుక్రవారం సాయంత్రం కూడా ఆమె మీడియాతో మాట్లాడుతూ తప్పక మంత్రి పదవి దక్కుతుందనే భరోసాతో కనిపించారు. గతంలో తెలుగు దేశంలో సహితం ప్రతిపక్షంలో ఉంటూ ముందుండి నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటాలు జరిపిన రోజా పార్టీ వర్గాలే అసూయతో 2009లో ఓటమికి దోహదపడటంతో ఆ తర్వాత పార్టీ మారి కాంగ్రెస్ లో ప్రవేశించారు. 

 పార్టీ తరఫున బలంగా వాణి వినిపించే మహిళా నేతగా కూడా రోజాకు  గుర్తింపు ఉంది. రాజకీయ పోరాటాలు జరపడంలో ఆమెకు చాలా తక్కువమంది గాని సరితూగరు. ఆమె పోరాట పటిమనే, ఆమె వాగ్ధాటినే ఆమెకు మంత్రిపదవి రాకుండా అడ్డుపడిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఆమెను అసెంబ్లీలో చూడరాదని గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమెను సంవత్సరంపాటు శాసనసభ నుండి బహిష్కరించారు. సుప్రీం కోర్ట్ వరకు వెళ్లి ఆమె దాదాపు ఒంటరిగా పోరాటం చేయవలసి వచ్చింది. పార్టీ నుండి నామమాత్రపు సహకారమే అందినదని చెబుతున్నారు. ఒక దశలో ఆమెకు సీట్ కూడా దక్కకుండా చేయాలనీ పార్టీలో ప్రయత్నాలు జరిగాయి. 

మంత్రిగా ఉంటె ఆమె ప్రజలలో, పార్టీ కార్యకర్తలలో విశేష ప్రాబల్యం సంపాదించు కొట్టారనే ఆమెకు మంత్రిపదవి దక్కలేదా అనే అనుమానాలు ఈ సందర్భంగా పలువురికి కలుగుతున్నాయి.