ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారామ్‌!

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌గా తమ్మినేని సీతారామ్‌, డిప్యూటీ స్పీకర్‌గా పీడిక రాజన్న దొరను నియమించనున్నట్లు తెలుస్తున్నది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలిపించుకొని తమ్మినేనితో భేటీ అయ్యారు. ఇంకా అధికార ప్రకటన వెలువడవలసి ఉంది.

ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస నియోజకవర్గం నుంచి తమ్మినేని ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. వైసీపీలో సీనియర్ నేత.. పైగా మంచి వాక్‌చాతుర్యం కలిగిన వ్యక్తి, సౌమ్యుడిగా, అందర్నీ కలుపుకుని పోయే వ్యక్తిగా పేరున్న తమ్మినేనిని స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించిందని చెబుతున్నారు.

కళింగ సామాజిక వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం గతంలో మంత్రిగా పనిచేశారు. 1983 ఎన్నికల్లో ఆముదాలవలస నుంచి మొదటిసారి తమ్మినేని టిడిపి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటికి ఆరుసార్లు సీతారాం ఎమ్మెల్యేగా గెలిచారు. 1985లో ప్రభుత్వ విప్‌గా తమ్మినేని పనిచేశారు. 1994లో చంద్రబాబు కేబినెట్‌లో మున్సిపల్ మంత్రిగా తమ్మినేని పనిచేసి తనదైన ముద్రవేసుకున్నారు.