జగన్‌ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు

ఇప్పటి వరకు దేశంలో మరే ముఖ్యమంత్రి చేయని విధంగా తన మంత్రివర్గంలో ఐదుగురు డిప్యూటీ ముఖ్యమంత్రులకు స్థానం కల్పించబోతున్నారు.పార్టీకి మద్దతుగా ఉన్న ఎస్సి, ఎస్టీ, మైనారిటీ, బిసి, కాపు సామజిక వర్గాల నుండి ఒకొక్కరికి ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు చెప్పారు. వీరిలో ఒకరు మహిళా కూడా ఉండే అవకాశం ఉంది. పైగా కేబినెట్‌లో సగం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్థానం కల్పించనున్నట్లు  ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్‌ఎల్పీ సమావేశంలో తెలిపారు

25 మందితో పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని నియమించనున్న జగన్‌ ..ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పిస్తానని వెల్లడించారు.పైగా రెండున్నరేళ్ల వరకు మంత్రివర్గంలో మార్పులు ఉండబోవని కూడా సంకేతం ఇచ్చారు. మంత్రివర్గంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తామని, రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని జగన్‌ స్పష్టం చేశారు. 

చంద్రబాబు పాలనలో అంచనాలను మించి టిడిపి నేతలు దోచుకున్నారని గుర్తు చేస్తూ  మంత్రుల ప్రమాణ స్వీకారం నాటి నుంచి పారదర్శక పాలన గురించే ఆలోచనలు చేయాలని హితబోధ చేశారు. ఇప్పటి వరకు తీసుకున్న అన్ని నిర్ణయాలు ఆ దిశగానే చేస్తున్నామని చెబుతూ అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని స్పష్టం చేశారు. మనం వేసే ప్రతి అడుగు ద్వారా ప్రగతి పెరగాలని,  నామినేషన్‌ పద్ధతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50శాతం పనులు అప్పగిస్తామని ప్రకటించారు.

సంక్షేమం కోసం పాలనలో చాలా మార్పులు తీసుకురావాలని చెబుతూ  అవినీతికి ఏమాత్రం తావివ్వకుండా పాలన జరగాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ‘హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కలిసి జ్యుడీషియల్‌ కమిషన్‌పై అడిగా.  ప్రతి కాంట్రాక్టు ప్రక్రియ మొదట్నుంచి జడ్జి వద్దకు వెళ్తుంది. ఏడు రోజుల పాటు పబ్లిక్‌ డొమైన్‌లో టెండర్ల ప్రక్రియ ఉంటుంది' అని పేర్కొంటూ ఇక నుంచి టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరగాలని స్పష్టం చేశారు.