తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ గల్లంతు !

తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్‌ పార్టీ గల్లంతయింది. కాంగ్రెస్‌ శాసనసభా పక్షం (సిఎల్పీ) టిఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం (టిఆర్‌ఎస్‌ఎల్పీ)లో విలీనమైంది. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి డా. వి.నర్సింహాచార్యులు గురువారం సాయంత్రం బులెటిన్‌ విడుదల చేశారు. ఇక నుండి కాంగ్రెస్‌ సభ్యులు అధికారపక్షం వైపే కూర్చుంటారాని పేర్కొన్నారు. 12 మంది సభ్యుల విలీనంతో సభలో  టిఆర్‌ఎస్‌ బలం 103కు (నామినేటెడ్‌ సభ్యునితో కలిపి)పెరిగింది.

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మొత్తం 18మంది ఎమ్మెల్యేల్లో మూడో వంతు ఎమ్మెల్యేలు అంటే 12మంది శాసనసభ్యులు తాము టిఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం అవుతున్నట్లు చేసిన తీర్మానాన్ని స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డికి అందజేశారు. బులెటిన్‌లో ఈ విషయాన్ని పేర్కొన్న శాసనసభ కార్యదర్శి రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లో పేర్కొన్న నిబంధనల మేరకు సిఎల్పీని టిఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేసినట్లు శాసనసభ కార్యదర్శి పేర్కొన్నారు. ఇకపై ఆ 12మంది ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలుగా పరిగణించబడతారని స్పష్టంచేశారు. 

అంతకుముందు కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకటరమణా రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి, రేగా కాంతారావు, ఆత్రం సక్కు, బానోతు హరిప్రియ, జాజుల సురేందర్‌, బీరం హర్షవర్ధన్‌ రెడ్డి, రోహిత్‌ రెడ్డి, కందాల ఉపేందర్‌ రెడ్డి, చిరుమర్తి లింగయ్య గురువారం ఉదయం టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. టిఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనమవుతున్నట్లు రాసిన తీర్మానం 12మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. అనంతరం అక్కడ నుంచి నేరుగా స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లి తీర్మానం కాపీని ఆయనకు అందజేశారు.

స్పీకర్‌ ఆ తీర్మానాన్ని అసెంబ్లీ కార్యదర్శికి పంపడం.. టిఆర్‌ఎస్‌ఎల్పీలో సిఎల్పీని విలీనం చేస్తూ శాసనసభ కార్యదర్శి బులిటెన్‌ విడుదల చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. కాంట్రాక్టర్లు ఇచ్చిన డబ్బుతో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని  పిసిసి నేత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు.

ఇలా ఉండగా, విలీనం పూర్తికావడంతో కాంగ్రెస్‌ శాసనసభలో విపక్షహోదా కోల్పోయింది. సభలో మొత్తం బలంలో పదోవంతు సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. 120 మంది సభ్యులు ఉన్న శాసనసభలో 12 మంది సభ్యులు కావాలి. కాంగ్రెస్‌కు ఆరుగురు సభ్యులే మిగలడంతో విపక్షహోదా గల్లంతయింది. విలీనం తర్వాత కాంగ్రెస్‌ కంటే మజ్లిస్‌ బలమే (7) ఎక్కువగా ఉండడం విశేషం.