12 నుంచి ఎపి అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు ఈనెల 12 నుంచి ప్రారంభంకానున్నాయి. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకావడంతో ఈ నెల 12 నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. కాగా, ఏపీ మంత్రివర్గం శనివారం ఉదయం 11.49 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నది. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ కొత్తమంత్రులతో ప్రమాణం చేయిస్తారు. 

ఈనెల 12 నుంచి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు శాసనసభ కార్యదర్శి ప్రకటించారు. ఈనెల 12న ఉదయం 11.05 గంటలకు 15వ అసెంబ్లీ తొలి సమావేశం జరగనుంది. 13న కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం, శాసనసభ స్పీకర్‌ ఎన్నిక నిర్వహించనున్నారు. 14న ఉభయసభల సంయుక్త సమావేశంలో సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగించనున్నారు. మరోవైపు శాసన మండలి సమావేశాలు కూడా 14 నుంచే ప్రారంభం కానున్నాయి.  

ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన వ్యక్తి శాసనసభ్యులతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ప్రొటెం స్పీకర్‌గా విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు నియమితులయ్యే అవకాశం ఉంది.  

ముఖ్యమంత్రి హోదాలో జ‌గ‌న్‌ మోహన్ రెడ్డి, ప్రతిప‌క్ష నేత హోదాలో చంద్రబాబు నాయుడు మొదటిసారిగా ఈ స‌మావేశాల‌కు హాజ‌రు కానున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్‌..విప్‌ల‌ను సైతం అధికారికంగా ప్రక‌టించ‌నున్నారు. అయితే, స్పీక‌ర్ ప‌ద‌వి ఎవ‌రికి వ‌రిస్తుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.