పంజాబ్ కాంగ్రెస్‌లో ముసలం... మంత్రివర్గ భేటీకి సిద్ధూ గైర్హాజరు

అధికారిక సమావేశాలకు, మంత్రివర్గ భేటీకి గైర్హాజరవుతూ, స్వతంత్రంగా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్న మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూకు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, గట్టి షాక్ ఇచ్చారు. సిద్ధూకు కేటాయించిన శాఖల్లో స్థానిక సంస్థల మంత్రిత్వ శాఖను తొలగించాలని ముఖ్యమంత్రి గురువారం పంజాబ్ గవర్నర్‌ విజయేంద్ర పాల్ సింగ్‌కు సిఫారసు చేశారు.

దానితో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి సిద్ధూ గైర్హాజరవడమే కాకుండా అదే సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అదే సమయానికి సిద్ధూ వేరుగా విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి తాను ఎంతగా కృషి చేసినదీ ఆయన వివరించారు.

సిద్ధూకు కేటాయించిన మంత్రిత్వ శాఖల్లో స్థానిక సంస్థల శాఖ చాలా ముఖ్యమైనది. ఈ శాఖను ప్రస్తుతానికి తానే నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. ఇక సిద్ధూ వద్ద పర్యాటకం, సాంస్కృతిక వ్యవహారాలు, ప్రదర్శన శాలల శాఖలు మాత్రమే ఉంటాయి.

 పంజాబ్ మంత్రిగా తాను సాధించిన విజయాలను వివరించేందుకు లోక్‌సభ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపును ఉదాహరణగా సిద్దు చూపించారు. ఈ ఎన్నికల్లో తనకు ముఖ్యమంత్రి రెండు జిల్లాల్లో కాంగ్రెస్ గెలుపు బాధ్యతలను అప్పగించారని చెప్పారు. ఈ రెండు జిల్లాల్లోనూ కాంగ్రెస్ ఘన విజయాలు నమోదు చేసిందన్నారు. తనను తేలికగా తీసుకోవద్దని, తాను పంజాబ్ ప్రజలకు జవాబుదారీనని అంటూ పరోక్షంగా ముఖ్యమంత్రిని హెచ్చరించారు.

ఎన్నికల్లో ఓటమికి తానొక్కడినే బాధ్యుడిని చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికల్లో గెలుపైనా, ఓటమైనా సామూహికంగా బాధ్యత వహించాలన్నారు. కొందరు కక్షగట్టి తనపై నిందలు మోపుతున్నారని, పార్టీ నుంచి తొలగించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేశారు.