కాంగ్రెస్ శాసనసభాపక్షం టీఆర్‌ఎస్‌ఎల్పీలోవిలీనం !

తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని టీఆర్‌ఎస్‌ఎల్పీలోవిలీనం చేస్తున్నట్లు 12 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలసి విజ్ఞప్తి పత్రం సమర్పించారు.  కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు.. తమ సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని స్పీకర్‌కు సమర్పించారు.

స్పీకర్‌ను కలిసిన ఎమ్మెల్యేల్లో మాజీ హోమ్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ప్రభుత్వ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఆత్రం సక్కు, హరిప్రియా, జాజుల సురేందర్‌, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, సుధీర్‌ రెడ్డి, రేగ కాంతారావు, పైలట్‌ రోహిత్‌ రెడ్డి, కందాల ఉపేందర్‌ రెడ్డి, చిరుమర్తి లింగయ్య ఉన్నారు.

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో పని చేయడానికి 12 మంది ఎమ్మెల్యేలం సిద్ధంగా ఉన్నామని గండ్ర వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. తమ నిర్ణయాన్ని కూడా ప్రజలు సంపూర్ణంగా ఆమోదించారని ఆయన తెలిపారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో 12 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. పిసిసి అధ్యక్షుడు  ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఎంపీగా గెలవడంతో హుజుర్‌నగర్‌ శాసనసభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో 6 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.18 మంది సభ్యులలో మూడింట రెండు వంతుల మంది పార్టీ మారితే ఫిరాయింపుల చట్టం పరిధికి రాదనీ అధికారులు చెబుతున్నారు.

గతంలో టిడిపి శాసనసభాపక్షం, కాంగ్రెస్ శాసనమండలి పక్షం ఇలాగే తెరాసలో విలీనమయ్యాయి. ఇదే వ్యూహంతో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ అసమ్మతి వర్గం ముందుకెళ్తోంది. ఇది జరిగితే కాంగ్రెస్ పార్టీ శాసనసభలో విపక్ష హోదాను కోల్పోతుంది.

 కాగా, సీఎల్పీని తెరాసలో విలీనం చేసే ప్రక్రియను నిరసిస్తూ కాంగ్రెస్‌ నేతలు అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం ఎదుట నేలపై కూర్చొని నిరసనకు దిగారు. నిరసన చేపట్టిన కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.