హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వైస్‌ ప్రెసిడెంట్‌ అదృశ్యం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వైస్‌ ప్రెసిడెంట్‌ సిద్ధార్థ్‌ కిరణ్‌ సంఘ్వీ బుధవారం నుంచి అదృశ్యమయ్యారు. సంఘ్వీ తన భార్య, నాలుగేళ్ల కుమారునితో కలిసి ముంబైలోని మలాబార్‌ హిల్స్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన బుధవారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి ఆఫీసుకు బయల్దేరి ఆ తర్వాత ఇంటికి తిరిగి చేరుకోలేదు.

అయితే గురువారం ఉదయం నవీ ముంబయి ప్రాంతంలో అనుమానస్పద స్థితిలో ఆయన కారును గుర్తించారు. కారు సీటుకు రక్తపు మరకలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఆయన అదృశ్యం అయినట్లు ముంబయిలోని ఎన్‌ఎమ్ జోషి మార్గ్‌లోని పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.

కమల మిల్స్‌లో ఉన్న ఆఫీసు నుంచి ఆయన ఎప్పటిలాగానే విధులు పూర్తయిన తరువాత రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఇంటికి బయల్దేరారని కార్యాలయ సిబ్బంది పేర్కొన్నారు. అయితే ఆయన ఆఫీసు నుంచి బయటకు వచ్చిన తరువాత కాలి నడకన వెళ్లడం సీసీ కెమెరాల్లో నమోదు అయ్యింది. ఆ సమయంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఆయన కారు లేదని పోలీసులు తెలిపారు.

ఆయన ఆఫీసు నుంచి బయటకు రాగానే ఆయన ఫోన్‌ స్విఛ్‌ ఆఫ్‌ అయ్యింది. పోలీసులు ఆయన కాల్‌ డేటాను పరిశీలిస్తే చివరి కాల్‌ కమల మిల్స్‌ పరిసర ప్రాంతం నుంచే వెళ్లినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. రాత్రి 10 గంటల సమయంలో సిద్ధార్థ్‌ భార్య అదృశ్యంపై ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వచ్చారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అడిషనల్‌ పోలీసు కమిషనర్‌ రవీంద్ర మాట్లాడుతూ సంఘ్వీ ఆచూకీ త్వరలోనే గుర్తిస్తామని తెలిపారు.