అవినీతిపై చర్యలు తీసుకోండి జగన్

గత ప్రభుత్వ హయాంలో నెలకొన్న అవినీతి, అక్రమాలు, రాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి ఏడు లేఖలు రాశారు. ప్రధానంగా రాజధాని భూ సమీకరణకు ముందు, తర్వాత జరిగిన అక్రమాలు, అసైన్డ్‌ భూముల కొనుగోలుపై న్యాయ విచారణ చేయించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. 33 వేల ఎకరాల భూ సమీరణ సందర్భంగా పర్యావరణాన్ని దెబ్బతీశారని లేఖల్లో పేర్కొన్నారు.

మాజీ సిఎం చంద్రబాబు అనుచరులు అక్రమంగా భూములు కొనుగోలు చేసి విక్రయించారని, రాజధానిలో దళితుల ఉపాధికి గండిపడిందని, దళితులు, బడుగు వర్గాలకు కేటాయించిన భూములను అగ్రకులాల వారు చేజిక్కుంచుకున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ఉచిత ఇసుక విధానంపై పునరాలోచన చేయాలని, అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసేలా కొత్త ఇసుక పాలసీ తేవాలని మరో లేఖలో కోరారు.

అగ్రిగోల్డ్‌ ఆస్తులను టిడిపి నాయకులు స్వాధీనం చేసుకోవడం వల్ల బాధితులకు ఇంకా న్యాయం జరగలేదని తెలిపారు. అగ్రిగోల్డ్‌లో అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలవరం భూ సేకరణలో అనేక లోపాలున్నాయని, భూమికి భూమి పరిహారం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో చుక్కల భూముల సమస్య తీవ్రంగా ఉందని, లక్షలాది మంది ప్రజలను ఈ సమస్య నుంచి బయట పడేయాలని కోరారు.

2016 కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో తొలగించిన దేవాలయాలను పునర్‌నిర్మించాలని, దేవాలయ భూముల పరిరక్షణ కోసం గత ప్రభుత్వం తెచ్చిన చట్టంలో మార్పులు తేవాలని తన లేఖలో కన్నా పేర్కొన్నారు.