టీఆర్‌ఎస్‌ హత్యా కాండకు బిజెపి కార్యకర్త బలి

ప్రాదేశిక ఎన్నికల ఫలితాల అనంతరం మహబూబ్‌నగర్‌ జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి  టీఆర్‌ఎస్‌ హత్యా రాజకీయాలకు పాల్పడడంతో ఒక బిజెపి కార్యకర్తతో పాటు మరో మహిళా మృతి చెందారు. దేవరకద్ర మండలం డోకూరులో బిజెపి కార్యకర్త ప్రేమ్‌కుమార్‌(23)పై ప్రత్యర్థులు దాడి చేసి హత్య చేశారు. డోకూరులో ఎంపీటీసీగా బిజెపి అభ్యర్థి భూపాల్‌రెడ్డి  టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రామకృష్ణారెడ్డిపై గెలుపొందారు.

ఈ నేపథ్యంలో రామకృష్ణారెడ్డి కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి తన అనుచరులతో బిజెపి కార్యకర్తలపై దాడికి పాల్పడి ప్రేమ్‌కుమార్‌ను హత్య చేసినట్లు కేసు నమోదు చేశామని భూత్పూరు సీఐ తెలిపారు.

మరోవంక, మహబూబ్‌నగర్‌ మండలం రామచంద్రాపూర్‌లో జరిగిన ఘర్షణలతో గ్రామస్థురాలు అనసూయ(45) మృతి చెందింది. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన లావణ్య అనుచరులతో టీఆర్‌ఎస్‌ నేతలు వాదులాటకు దిగగా సర్దిచెప్పడానికి అనసూయ ప్రయత్నించింది. ఆ సమయంలో జరిగిన తోపులాటలో కింద పడి ఆమె మృతిచెందింది. ఈ ఘటనలో 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బిజెపి ఎదుగుతున్న క్రమంలో భయభ్రాంతులకు గురై కెసిఆర్ హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. నారాయణపేట జిల్లా దేవరకద్ర గ్రామంలో బిజెపి కార్యకర్త ముష్టి ప్రేమ్ కుమార్ హత్యలో టీఆర్ఎస్ అగ్రనాయకుల ప్రమేయముందని ఆరోపించారు. బిజెపి కార్యకర్త ప్రేమ్ కుమార్ తో పాటు మరో ముగ్గురు కలిపి సామూహికంగా హత్య చేసేందుకు టిఆర్ఎస్ నాయకత్వం కుట్రపన్నిందని తెలిపారు.

మమతా బెనర్జీ అఖిలేష్ యాదవ్ పినరాయి విజయన్ ల మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ నాయకత్వం రాజకీయాలకు తెరలేపిందని బండి సంజయ్ మండిపడ్డారు. రానున్న రోజుల్లో దాడులు హత్యా రాజకీయాలు మితి మీరు పోయే ప్రమాదం ఉందని చెబుతూ వాటిని ధీటుగా ఎదుర్కునేందుకు బిజెపి నాయకత్వం సిద్ధంగా ఉందని హెచ్చరించారు దేవరకద్ర లో జరిగిన బిజెపి కార్యకర్త ప్రేమ్ కుమార్ హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపి హంతకులను కుట్రకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

దాడులు హత్య రాజకీయాలకు పాల్పడితే మమతా బెనర్జీ అఖిలేష్ యాదవ్ కు పట్టిన గతే కెసిఆర్ అనుభవిస్తారని బండి సంజయ్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యకర్తలు నాయకులు మనోధైర్యంతో ప్రజా క్షేత్రంలో ముందుకు సాగి టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నిర్మించాలని ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు.

ఇలా ఉండగా, నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం మహదేవునిపేట ఎంపీటీసీకి బిజెపి అభ్యర్థిగా పోటీచేసిన వరలక్ష్మిపై బుధవారం రాత్రి  టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేశారు. తలకు తీవ్రగాయమైంది. వరలక్ష్మి భర్త నారాయణాచారి తెలిపిన వివరాల ప్రకారంమంగళవారం ప్రకటించిన ప్రాదేశిక ఫలితాలలో మహదేవునిపేట ఎంపీటీసీ సభ్యునిగా టీఆర్‌ఎస్‌  అభ్యర్థి తిరుపతిరెడ్డి బిజెపి అభ్యర్థి వరలక్ష్మిపై 20 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

బుధవారం రాత్రి   టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వరలక్ష్మి ఇంటికి వచ్చి.. తమ అభ్యర్థిపైనే పోటీ చేస్తావా అని ఇనుపరాడ్‌తో ఆమె తలపై దాడి చేశారు. కుటుంబసభ్యులు ఆమెను వెంటనే చికిత్స కోసం నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు.