భద్రాచలం ఏపీకి అప్పగింతకు కసరత్తు !

ప్రస్తుతం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న భద్రాచలం గ్రామాన్ని నవ్యాంధ్రలో విలీనం చేసే అంశంపై రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు ప్రారంభమైనట్లు తెలిసింది. భద్రాద్రిని ఎపిలో కలిపే ప్రతిపాదనపై ఒక వంక తెలంగాణ ప్రభుత్వం, మరో వంక కేంద్ర ప్రభుత్వం సైతం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌తో ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజ్ భవన్ లోజరిపిన భేటీలో ఈ విలీన అంశం తెరమీదకొచ్చింది. 

భద్రాద్రిని ఎపిలో కలిపేందుకు తెలంగాణ సిఎం కెసిఆర్‌ ప్రాథమికంగా సుముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. అయితే భద్రాద్రిని నవ్యాంధ్రలో కలపాలంటే పెద్ద తతంగం ఉంది. రెండు రాష్ట్రాల శాసనసభల్లో తీర్మానం ఆమోదించాలి. ఆ తీర్మానాన్ని కేంద్రం ఆమోదించాలి. ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంట్‌లో సవరించాలి. ఆ తరువాత రాష్ట్రపతి గజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలి. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం తలుచుకుంటే ఈ ప్రక్రియ పెద్ద కష్టమేం కాదని రాజ్యాంగ నిపుణులు భావిస్తున్నారు. 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాఫీగా సాగేందుకు ఐదేళ్ల క్రితం ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ఊరును మినహాయించి ఏడు మండలాలను ఎపిలో కలిపారు. నరేంద్ర మోదీ ప్రధాని కాగానే తొలి మంత్రివర్గంలోనే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఎపిలో కలిపేందుకు వీలుగా రీ-ఆర్గనైజేషన్‌ యాక్టును సవరిస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేశారు. తర్వాత పార్లమెంట్‌లో బిల్లు తెచ్చారు. 

ఇదిలా ఉండగా సమైక్య రాష్ట్రంలో ఎనిమిది మండలాలతో కూడిన భద్రాచలం రెవెన్యూ డివిజన్‌ 1959కి పూర్వం ఆంధ్రా ప్రాంతంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది. తదుపరి పరిపాలనా సౌలభ్యం, రహదారి సంబంధాలు, గిరిజనులకు మౌలిక, ప్రాధమిక సదుపాయాలను మెరుగు పర్చే లక్ష్యంతో భద్రాచలం డివిజన్‌ను ఖమ్మం జిల్లాలో కలిపారు. 

రామాలయం సెంటిమెంట్‌ రీత్యా భద్రాద్రి ఊరు మాత్రం తెలంగాణలో ఉంచి, చుట్టూ ఉన్న ప్రాంతమంతా ఎపిలో ఉండటంతో భద్రాచలం వాసులు పాలనాపరంగా ఇబ్బందులు పడుతున్నారని ఇప్పుడు రెండు ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి. తెలంగాణ భూభాగంలో రాముడి దేవాలయం ఉండగా, గుడి మాన్యాలు ఎపిలో ఉన్నాయన్నది మరో వాదన. ఐటిడిఎ, విద్య, వైద్యం, మౌలిక వసతుల పరంగా ఏజెన్సీ గిరిజనులకు ఇబ్బందిగా పరిణమించిందనీ చెబుతున్నారు. 

ఈ కారణాలతో పాటు పోలవరం ప్రాజెక్టు దీర్ఘకాల ప్రయోజనాల రీత్యా భద్రాద్రి గ్రామాన్ని ఎపిలో కలపడర ఉత్తమమనే ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. భద్రాచలం పౌర సంఘాలు, వేదికలు తమ తమను ఎపిలో కలపాలని ఇప్పటికే తెలంగాణ సర్కారుకు విన్నవించుకున్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌లో ఎపి పాలనకోసం పదేళ్లకు కేటాయించిన సచివాలయ భవనాలను ఎపి సర్కారు తెలంగాణకు ఇచ్చేసేందుకు సిద్ధపడిన సమయంలోనే భద్రాద్రిని ఎపిలో విలీనం చేసే అంశానికి బీజం పడినట్లు తెలుస్తోంది.