జమ్ముకశ్మీర్‌లో రెచ్చిపోయిన వేర్పాటువాదులు

జమ్ముకశ్మీర్‌లో వేర్పాటువాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్‌లోని జామియా మసీద్‌ ప్రాంతంలో భద్రతా బలగాలపై రాళ్లు రువ్వారు. ఉగ్రవాది జకీర్‌ ముసా, అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్‌ అజార్‌కు మద్దతుగా పోస్టర్లు పట్టుకుని ఈ చర్యలకు పాల్పడ్డారు. 

రంజాన్‌ సందర్భంగా రాష్ట్రంలోని ముస్లింలు మసీదులకు వెళ్తూ ప్రార్థనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో వేర్పాటు వాదులు ముఖానికి ముసుగులు ధరించి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ పలు చోట్ల ఇటువంటి ఘటనలకు పాల్పడ్డారు. ఉత్తర కశ్మీర్‌లోని సోపోర్‌, దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్‌లోనూ ప్రార్థనల అనంతరం ఇటువంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. 

రాష్ట్రంలోని పరిస్థితులను అదుపుచేసి, శాంతి భద్రతలను కాపాడేందుకు భద్రతా బలగాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయని అధికారులు మీడియాకు తెలిపారు. మూడు, నాలుగు జిల్లాల్లో తప్ప ఇతర ప్రాంతాల్లో పరిస్థితులు శాంతియుతంగానే ఉన్నాయని వివరించారు. 

కశ్మీర్‌ లోయలోని హజరతబల్‌ ప్రార్థనా మందిరానికి వేలాది మంది ముస్లింలు ప్రార్థనల కోసం వచ్చారని తెలిపారు. ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న శ్రీనగర్‌ నౌహత్తాలోని జామియా మసీదుకు కూడా చాలా మంది ప్రార్థనల కోసం వచ్చారని చెప్పారు. పరిస్థితులు అదుపుతప్పకుండా భద్రతా బలగాలు అన్ని చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.