కేశినేని నాని విప్‌ తిరస్కారంపై టిడిపిలో కలకలం

లోక్‌సభ టిడిపి ఫ్లోర్ లీడర్‌గా ఎంపీ రామ్మోహన్ నాయుడును, విప్‌గా కేశినేని నానిని నియమిస్తున్నట్లు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు  ప్రకటించడం ఆ పార్టీలో కలకలంకు దారితీసింది. తనను తగు ప్రాధాన్యత ఇవ్వలేదని అసంతృప్తితో ఉన్న నాని చంద్రబాబు నియామకాన్ని సున్నితంగా తిరస్కరించారు.  చంద్రబాబు తనను క్షమించాలని కోరారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ కూడా పెట్టారు.

మీడియాతో మాట్లాడటానికి నాని విముఖత వ్యక్తం చేశారు. తానేం చెప్పాలో అది ఫేస్ బుక్‌లో చెప్పానని, దయచేసి దీనిని రాజకీయం చేయొద్దని ఆయన కోరారు. తనకు అంత పెద్ద పదవి వద్దని, దానిని ఎవరి కన్నా ఇవ్వండని పోస్ట్ చేశారు. కేశినేని నాని నిర్ణయంపై టీడీపీలో కలకలం రేగింది. 

ఈ పదవుల పంపకంపై ఎంపీ కేశినేని నాని మనస్తాపానికి గురయ్యారు. తనకు పార్టీలో ప్రాధాన్యం కల్పించటం లేదని అసంతృప్తితో విజయవాడలో చంద్రబాబు నిర్వహించిన ఇఫ్తార్‌ విందుకు హాజరుకాలేదు. పార్టీ కట్టబెట్టిన పదవులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఫేస్‌బుక్‌లో స్పందించారు. 

‘‘లోక్‌సభలో పార్టీ విప్‌ పదవి ఇచ్చినందుకు అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు.  నా కంటే సమర్థుడైన  వేరొకరిని ఆ పదవిలో నియమించాలని విజ్ఞప్తి చేస్తున్నా. అంత పెద్ద పదవి చేపట్టడానికి నేను అనర్హుడినని భావిస్తున్నా. విజయవాడ ప్రజలు నన్ను ఎంపీగా ఎన్నుకున్నారు. వారి ఆశీస్సులు నాకున్నాయి. పార్టీ ఇచ్చే విప్‌ పదవి కంటే ప్రజలకు సేవ చేయడం ఎంతో సంతృప్తి ఇస్తుంది’’ అని పేర్కొన్నారు. 

ఇటీవల నాని టీడీపీకి గుడ్‌బై చెప్పనున్నారని, బీజేపీలో చేరనున్నారని తొలుత  ప్రచారం కూడా జరిగింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఆయన భేటీ కావడంతో ఈ సందేహాలు మరింత బలపడ్డాయి. అయితే బీజేపీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని, తనకు ఆ అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎంపీ కేశినేని నాని ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్ ఇదే.