ముగ్గురు కాశ్మీరీ వేర్పాటువాదుల అరెస్ట్

 ఉగ్రవాదులకు నిధులు అందజేస్తున్నారన్న ఆరోపణపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కశ్మీర్‌కు చెందిన వేర్పాటువాదులు షబ్బీర్‌షా, ఆసియా అంద్రబి, మసారత్ ఆలంభట్‌ను అరెస్టు చేసింది. ఆ ముగ్గురికి ఢిల్లీ కోర్టు 10 రోజుల పోలీసు కస్టడీ విధించింది. 

ముంబైలో 2008లో జరిగిన ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి హఫీజ్‌సయీద్‌కు చెందిన జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థకు కశ్మీర్ లోయ నుంచి నిధులు అందుతున్నాయన్న ఆరోపణపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసుపై ఢిల్లీలో ప్రత్యేక జడ్జి రాకేశ్ సయాల్ మంగళవారం విచారణ జరిపారు. 

ఈ సమయంలోనే ఆ ముగ్గురిని ఎన్‌ఐఏ అరెస్టు చేసిందని నిందితుల తరఫు న్యాయవాది వెల్లడించారు. షబ్బీర్ షా, ఆసియా అంద్రబి వేర్వేరు కేసుల్లో ఇప్పటికే పోలీసు కస్టడీలో ఉన్నారు. కాగా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడన్న ఆరోపణపై అరెస్టయిన మసారత్ ఆలంను బదిలీ రిమాండ్‌పై జమ్ముకశ్మీర్ నుంచి ఢిల్లీకి తరలించారు. 

కశ్మీర్ లోయలో వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణపై ఎన్‌ఐఏ 2018 జనవరిలో హఫీజ్ సయీద్, సయ్యద్ సలాహుద్దీన్, మరో 10 మంది వేర్పాటువాదులపై చార్జిషీట్ దాఖలు చేసింది. ఎన్‌ఐఏ దాఖలు చేసిన చార్జిషీట్ ప్రకారం, హవాలా వ్యాపారి అయిన జహూర్ అహ్మద్ షా వతల్ నుంచి షబ్బీర్ షా రూ.10 లక్షలు తీసుకున్నాడు. ఆ సొమ్మును నిషేధిత సంస్థ దుఖ్తరాన్ ఏ మిలత్‌కు పంపించాడు. ఈ సంస్థకు అంద్రబి అధినేతగా ఉన్నది.