కొండా సురేఖ దిక్కార ధోరణి.. కేటిఆర్ పై మండిపాటు

టీఆర్ఎస్ తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో మాజీ మంత్రి కొండా సురేఖ దిక్కర ధోరణిని ప్రదర్శించారు. తాము రెండు సీట్లు అడిగామనడం పచ్చి అబద్ధమని అంటూ  తమను పొమ్మనలేక పొగబెట్టారని ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది తనను అవమాన పరచటమే అని స్పష్టం చేస్తూ తాను చేసిన తప్పు ఏంటో చెప్పాలని ఆమె టీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు ను ప్రెస్ మీట్ లో నిలదీశారు.

తనకు టికెట్ ఇవ్వకపోవడానిక కేటీఆరే కారణమంటూ, టీఆర్‌ఎస్‌లో కేటీఆర్ కోటరీని తయారుచేస్తున్నారని కొండా సురేఖ ఆరోపించారు. తెలంగాణ కల్వకుంట్ల వారి ఇల్లు కాదంటూ తమకు ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచే సత్తా ఉందని ఆమె స్పష్టం చేశారు.

మంత్రివర్గంలో మహిళలకే స్థానం కల్పించకుండా కాలం గడిపిన ముఖ్యమంత్రి చరిత్రలో నిలిచి పోతారని అంటూ ఎద్దేవా చేసారు. బీసీ మహిళ అయిన తనను అవమానించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  జాబితాలో తన పేరు లేకపోవడం తనను అవమానించడమే అని ఆమె స్పష్టం చేసారు

పరకాల సీటు అడిగితే వరంగల్ ఈస్ట్ నుంచే పోటీ చేయమని కేసీఆర్ అన్నారని, ఆయన మాట మేరకు అక్కడ నుంచి 56వేల భారీ మెజార్టీతో గెలిచానని గుర్తు చేసారు. పార్టీ నుంచి రూపాయి తీసుకోకుండా వరంగల్ ఈస్ట్ నుంచి విజయం సాధించానని చెబుతూ తనకు  మంత్రి పదవి, మురళీకి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని గతంలో కేసీఆర్ మాట ఇచ్చి, మాట తప్పారని ఆమె మండిపడ్డారు.

కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా తమ సొంత ఖర్చుతో అభ్యర్థులను గెలిపించామని,  నాలుగుసార్లు ఓటమి లేకుండా గెలిచానని అంటూ ఉద్యమంలో పాలుపంచుకున్న మహిళలకు సరైన స్థానం కల్పించడంలో టీఆర్ఎస్ విఫలం అయిందని ఆమె విమర్శించారు.

“పార్టీకి మేం చేసిన తప్పంటి?. అన్ని భరిస్తూ సాధారణ కార్యకర్తగా పార్టీ అభివృద్ధి కోసం పని చేశాం. అయినా నేను ఏ రోజు క్రమశిక్షణ తప్పలేదు.  టీడీపీ నుంచి వచ్చినవారికి టికెట్లు ఇచ్చారు.  ప్రజల్లో ఉండి పార్టీ కోసం పనిచేసిన మాకు టికెట్ ఎందుకు ఆపాల్సి వచ్చింది” అంటూ కెసిఆర్ పై ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు.

ఇప్పటివరకు టీఆర్ఎస్‌ నుంచి తాము ఎలాంటి లబ్ది పొందలేదని, పార్టీ అభివృద్ధి కోసమే పనిచేశామని మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ పేర్కొన్నారు. మాట్లాడుతూ తనకు సీటు ఇవ్వకపోవడం మహిళలందరినీ అవమానించడమే అని విమర్శించారు. మహిళల పాత్ర లేకుండానే తెలంగాణ వచ్చిందా? అని ఆమె కెసిఆర్ ను నిలదీశారు.

బీసీ, ఎస్సీ మహిళలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ గుర్తుపైనే గెలిచిన తాము చేదు అయ్యామని, కానీ టీడీపీ నుంచి వచ్చిన ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎందుకు తీపి అయ్యారని ఆమె టీఆరెస్ అధిష్టానాన్ని నిలదీశారు. ఎర్రబెల్లికి తనకు పడదని తెలిసినప్పటికీ ఆయన్ని టీఆరెస్‌లో చేర్చుకున్నారని, ఈ విషయంలో తమను కనీసం సంప్రదించలేదని ఆవేదన చెందారు.

ప్రజా ప్రతినిధిగా తాను ఎంతో కష్ట పడి పనిచేశానని, ప్రజాసేవ కోసం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకొన్న తాను ఏనాడు పదవుల కోసం కెసిఆర్ చుట్టూ తిరగ లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. సర్వేలు నివేదికలను బట్టి సీట్లు ఇచ్చామని అన్నడాన్ని అవహేళన చేస్తూ టీఆరెస్ టికెట్లు ఇచ్చిన ఎమ్మెల్యేల రిపోర్ట్‌ బయటపెట్టాలని ఆమె సవాల్ చేశారు. ఎవరి ప్రభావంతో తన టికెట్‌ ఆపారో చెప్పాలని కెసిఆర్ ను ప్రశ్నించారు. తమ ఫోన్‌లను ట్యాప్‌ చేస్తున్నారని ఆరోపించారు.