మహారాష్ట్ర బిజెపిలోకి 10మంది కాంగ్రెస్ ఎమ్యెల్యేలు!

లోక్ సభ ఎన్నికలలో కేవలం ఒక సీట్ తో సరిపెట్టుకొని మహారాష్ట్రలో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీకి మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో కోలుకోలేని షాక్ కలిగింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఈ మధ్య వరకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన రాధాకృష్ణ విఖే పాటిల్‌ శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు.  కాంగ్రెస్ మాజీ మంత్రి అబ్దుల్ సత్తార్ తో కలిసి కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు.

త్వరలోనే వారిద్దరూ బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తున్నది. విఖే పాటిల్‌ కుమారుడు సుజయ్ విఖే పాటిల్‌ లోక్ సభ ఎన్నికలలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి అహ్మద్ నగర్ నుండి గెలుపొందారు. గత ఏప్రిల్ లోనే  విఖే పాటిల్‌ ప్రతిపక్ష నాయకుడిగా రాజీనామా చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు.

ఈ సందర్భంగా అబ్దుల్ సత్తార్ మీడియా మాట్లాడుతూ, తాను త్వరలోనే బీజీపీలో చేరనున్నట్టు ఆయన చెప్పారు. 8 మంది నుంచి 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీతో మంతనాలు జరుపుతున్నట్టు కూడా ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధినాయకత్వం పనితీరుతో తాము అసంతృప్తితో ఉన్నందునే పార్టీని వీడాలని నిర్ణయించినట్టు చెప్పారు. రాష్ట్ర నాయకత్వం పార్టీని పూర్తిగా ధ్వంసం చేస్తోందని ఆయన ఆరోపించారు.